ఆర్ఎస్ఎస్ నాల్గన సర్ సంఘచాలక్ రజ్జూ భయ్యా

ఆర్ఎస్ఎస్ నాల్గన సర్ సంఘచాలక్ రజ్జూ భయ్యా
 
* జన్మదిన నివాళి
 
ఎన్ ఎస్ కళ్యాణ్ చక్రవర్తి
స్వయంసేవకులు రజ్జూ భాయా అని ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్ రాజేంద్రసింహాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. ఆయన 1922 జనవరి 29న ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌ షహర్ లో జన్మించారు. ఆయన తల్లి జ్వాలాదేవి, తండ్రి బల్బీర్ సింగ్.
 
ఈయన ప్రాథమిక విద్య ఢిల్లీలోని మోడ్రన్‌ స్కూల్లోనూ, నైనిటాల్ పబ్లిక్ స్కూల్లోనూ పూర్తి చేశారు. ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి 21 సంవత్సరాల వయసులోనే ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో రజ్జూ భయ్య అనేక సంవత్సరాలు న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి అధ్యాపకుడిగా పనిచేశారు. అంతకు ముందు రాజేంద్ర సింహాజీ నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ పర్యవేక్షణలో తెలివైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 
అనతి కాలంలోనే అంటే 1960లో భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా రజ్జూ భయ్యా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల ఆకర్షితులైన ఆయన సంఘ కార్యం కోసం 1966లో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి సేవకు అంకితమయ్యారు.
 
 ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఇలా..
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో రజ్జూ భయ్యా చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆర్ఎస్ఎస్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. యువకుడిగా ఉన్నప్పటి నుంచే సంఘ్ లో అనేక బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ వచ్చారు. 1966లో ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత 1967 నుంచి ఈశాన్య ప్రాంతాల ప్రచారక్ గా పనిచేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోనూ కొంతకాలం ప్రచారక్ గా పనిచేశారు.
 
1975-77 ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణతో కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయవంతం చేశారు. జనతా పార్టీ ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర వహించారు. 1976లో ఢిల్లీలో జస్టిస్ వీఎం తార్కండే అధ్యక్షతన నిర్వహించిన మానవ హక్కుల సదస్సుకు రజ్జూ భయ్యా అధ్యక్షత వహించారు. దేశమంతా అనేక పర్యాయాలు పర్యటన చేశారు. 1977లో సహ సర్ కార్యవాహ బాధ్యతలు చేపట్టారు. 1978 సర్ కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తించారు.
 
ప్రజల్ని చైతన్య పరచడంలో ఎప్పుడూ ముందుండే రజ్జూ భయ్యా1994 మార్చిలో ఆర్ఎస్ఎస్ 3వ సర్ సంఘచాలక్  మధుకర దత్తాత్రేయ దేవరస్ ఆరోగ్యం క్షీణించడం వల్ల రాజేంద్ర సింహాజీకి సర్ సంఘచాలక్ గా బాధ్యతలు అప్పగించారు. రజ్జూ భయ్యా స్వతహాగా విద్యావేత్త కావడంతో సమాజంలోని వివిధ రంగాల మేధావులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. విదేశాల్లో కూడా పలు పర్యటనలు చేశారు. యుకే, అమెరికా , ఆఫ్రికా ఖండాలలో విస్తృతంగా పర్యటించారు.
 
విద్యార్థుల పట్ల అంకిత భావన
 
రజ్జూ భాయా విద్యార్థుల పట్ల, తరగతి గదుల పట్ల చాలా అంకిత భావం ప్రదర్శిస్తుండేవారు. సంఘ కార్యం కోసం పర్యటనలు జరుపుతూనే చాలాసార్లు రైల్వే స్టేషన్ నుండి నేరుగా ధోవతి, సంఘ నిక్కర్ తోనే యూనివర్సిటీకి వెడుతూ ఉండేవారు. రైలు ప్రయాణం సమయంలో, లేదా రాత్రి సమయంలో తరగదిలో చెప్పే అంశాల గురించి తయారు అవుతూ ఉండేవారు.
 
క్లిష్టమైన న్యూక్లియర్ ఫిజిక్స్ పాఠ్యంశాలను  విద్యార్థులతో కూర్చుని వారికి తేలికగా అర్ధం అయ్యేందుకు మొదట హిందీలో బోధించి, తర్వాత ఇంగ్లీష్ లో సవివరంగా చెప్పేవారు. పేదరికంలో ఉన్న విద్యార్థులకు తన సొంత ఆదాయాన్ని ఖర్చుపెడుతూ ఉండేవారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు బాగా చదివిన వారికి వస్త్రాలు, ఇతర బహుమతులు ఇస్తుండేవారు.
 
ఆయన ప్రజాజీవనంలో నైతికతకు ప్రాధాన్యత ఇచ్చేవారు. 20 సంవత్సరాల వయస్సులో సంఘ్ తో పరిచయంలోకి వచ్చి, మరో 24 ఏళ్లపాటు ఉద్యోగం చేసి, తన ఆదాయంతోనే తన ఖర్చులు పెట్టుకునేవారు. ఉత్తర ప్రదేశ్ లో తండ్రి మొదటి భారతీయ సాగునీటి ఇంజనీర్. సంపన్న కుటుంబమైనా తన అవసరాలకోసం తన ఆదాయంపైననే ఆధారపడుతూ ఉండేవారు.
 
సంస్కృతం పట్ల ఆసక్తి
 
తన ముందున్న సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ తన ప్రసంగాలలో సంస్కృత శ్లోకాలను భావార్థలతో వివరిస్తుండటం గమనించి ఆయన కూడా ఆ భాష పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ప్రచారక్ గా తన పర్యటనలలో సంస్కృతం చందమామ ప్రతులను తీసుకెడుతూ బాల స్వయంసేవక్ లకు ఇస్తుండేవారు. తాను కూడా ఆ భాషను నేర్చుకోవాలని ప్రయత్నం చేశారు.
 
ఒక సారి కేరళలో వైద్యంకోసం ఓ నెలరోజులు ఉన్నప్పుడు స్వయంసేవక్ లను తనకు సంస్కృతం నేర్పమని కోరారు. దానితో సాధారణ స్వయంసేవక్ ల నుండు సర్ కార్యవాహ హెచ్ వి శేషాద్రి వరకు ఆయనకు ఆ నెలరోజులు సంస్కృత పాఠాలు చెప్పారు. సర్ సంఘచాలక్ కు ఆ విధంగా పాఠాలు చెప్పే అవకాశం లభించడంతో వారెంతో సంతోషించారు.
 
విస్తృతమైన సామాజిక సంబంధాలు
 
పాఠశాలల రోజుల నుండి తన సంపర్కంలోకి వచ్చిన వారితో ఇంటర్ నెట్ లేని రోజులలో సహితం దేశ, విదేశాలలో ఉన్నప్పటికీ నిరంతరం సంబంధాలు కొనసాగిస్తుండేవారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు అన్ని వర్గాలలో .. ఉన్నత పదవులలో ఉన్నవారి నుండి సామాన్యుల వరకు మంచి స్నేహితులు ఉండేవారు. 1950లలోనే ఒక యువకుడిగా నాటి ముఖ్యమంత్రి జిపి పంత్ ను గోరక్షణ బిల్లును ఆమోదింపచేయమని ప్రోత్సహించారు.
 
చాలామందికి తెలియదు. ఉత్తర ప్రదేశ్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రభుత్వంకు బిజెపి మద్దతు ఇచ్చేటట్లు చేసింది ఆయనే. `సామజిక సమరసత’కు అవసరం అని భావించారు. ఎమర్జెన్సీ చివరి రోజులలో ఇందిరాగాంధీ చరణ్ సింగ్ ను దగ్గరకు చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, జనతా పార్టీలో చరణ్ సింగ్ చేరేటట్లు చేసింది రజ్జూ భాయి అని చాలామందికి తెలియదు.  ఆయన సర్ సంఘచాలక్ గా ఉన్నప్పుడే కేంద్రంలో మొదటిసారిగా వాజపేయి సారధ్యంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
గ్రామీణ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ
 
భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు రజ్జూ భయ్యా కృషి చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి అహర్నిశలు పని చేశారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి 1995లో గ్రామాలను ఆకలి రహిత, వ్యాధుల రహితంగా, విద్య, స్వయం సమృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించారు.
 
ఆ విధంగా దేశవ్యాప్తంగా 100కు పైగా ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేశారు. స్వయం సేవకులు చేసిన ఈ గ్రామీణ అభివృద్ధి పనులు చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలకు ప్రేరణగా రూపాంతరం చెందాయి.
 
 ప్రతి వ్యక్తి కావాలి.. జాతికి శక్తి …. నినాదంతో
సంఘ కార్యం… ఆలోచన సరళి ఏ పరిస్థితుల్లోనైనా విశిష్టమైనదేనని రజ్జూభయ్యా విశదీకరించారు. సమాజంలో మౌలికమైన మార్పు రావాలంటే ప్రతి వ్యక్తిలోనూ ఆదర్శమైన పరివర్తన రావాలని, వ్యక్తి మారకుండా ప్రభుత్వాల అధికారం చేతులు మారినంత మాత్రాన సమాజంలో సరైన మార్పురాదని ఆయన నమ్మేవారు. ప్రతి వ్యక్తిలో ఈ సమాజం నాదనే భావన నిర్మాణమైనప్పుడే సమగ్రమైన మార్పు వస్తుందని ఆయన చెప్పారు.
 
ప్రతి వ్యక్తి జాతికి ఒక శక్తిగా నిలవాలన్న వారి పిలుపు సామాజిక కార్యకర్తలకు ముఖ్యంగా స్వయం సేవకులకు మార్గదర్శకంగా ఉంది. ఇక 2000 సంవత్సరంలో సర్ సంఘచాలక్ గా ఉన్న రజ్జూ భయ్యా ఆరోగ్యం క్షీణించడంతో ఆ బాధ్యతలను 5వ సర్‌ సంఘ్‌చాలక్‌గా  కే.యస్ సుదర్శన్ జీకి అప్పగించారు.
 
సంపూర్ణ వ్యక్తిత్వంకు ఆయన నిదర్శనం. మధుమేహం ఆవరించినప్పుడు “నాకు జీవితంలో మరి స్నేహితుడు వచ్చాడు” అంటూ నవ్వుతూ చెప్పారు. వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలు ఎదురైనా ఏనాడూ విచారంగా కనిపించేవారు కాదు. తన అనారోగ్యం గురించి ఎవ్వరితో చర్చించేవారు కాదు. నిండైన జీవితం గడిపారు.  2003 జులై 14న 81 ఏళ్ళ వయస్సులో పూణే లో మృతి చెందారు.