అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర్ కోసం శ్రీరాముడు, సీతమ్మ విగ్రహాల కోసం నేపాల్ నుంచి భారీ కొండ రాయి తీసుకొస్తున్నారు. ఈ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని నిపుణులు చెప్తున్నారు. అయితే వీటితో తయారుచేసే విగ్రహాలను అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారా? లేక మరో ప్రాంగణానికి తరలిస్తారా? అన్నది ఇంకా నిర్ణయించలేదు.
దీనిపై రామ మందిరం ట్రస్టు తుది నిర్ణయం తీసుకోనున్నది. శాలిగ్రామ శిలలు కేవలం శాలిగ్రామి నదిలోనే దొరుకుతాయి. ఈ నది దామోదర్ కుండ్ నుంచి పుట్టి బిహార్‌లోని సోనేపూర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. భారీ రెండు శిలలను భౌగోళిక, పురావస్తు నిపుణుల పర్యవేక్షణలో నేపాల్‌లోని పోఖారాలో ఉన్న శాలిగ్రామి నది నుంచి సేకరించినట్లు తెలుస్తున్నది.
జనవరి 26న ఈ భారీ శిలలను ట్రక్కుల్లో ఎక్కించారు. పూజల అనంతరం వీటిని రోడ్డు మార్గంలో అయోధ్యకు తరలిస్తున్నారు. దారిలో ఈ శిలలను చూసేందుకు, స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. రెండు భారీ శిలల్లో ఒకదాని బరువు 26 టన్నులు కాగా, మరొకటి 14 టన్నులు.
ఈ శిలలు శనివారం జనక్‌పూర్‌కు చేరుకున్నాయి. ఇక్కడ రెండు రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. అనంతరం వీటిని బిహార్ మధుబనిలోని సహర్‌ఘాట్, బేనిపట్టి మీదుగా దర్భంగా, ముజఫర్‌పూర్‌కు చేర్చుతారు. బిహార్‌లోని 51 ప్రదేశాల్లో ఈ శిలలకు పూజలు జరుగనున్నాయి. జనవరి 31న గోపాల్‌గంజ్ మీదుగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి.శిలాయాత్రతో నేపాల్ మాజీ ఉప ప్రధాని కమలేంద్ర నిధి, జనక్‌పూర్ మహంత్, వీహెచ్‌పీ కేంద్ర ఉపాధ్యక్షుడు జీవేశ్వర్ మిశ్రా, రాజేంద్రసింగ్ పంకజ్‌తో పాటు మరో 100 మంది ప్రముఖులు కూడా అయోధ్య వస్తున్నారు.
‘శిలలను అయోధ్యకు తీసుకురావాలని నేపాల్‌కు చెందిన కొందరు పెద్దలు మమ్మల్ని అడిగారు. శిలలు అయోధ్యకు చేరుకున్న తర్వాత ఏం చేయాలో, ఎలా వాడుకోవాలో ట్రస్ట్ నిర్ణయిస్తుంది. ఈ రెండు శిలలు ఫిబ్రవరి 2 న అయోధ్యకు చేరుకోనున్నాయి. శాలిగ్రామి నది నుంచి సేకరించిన ఈ శిలలు అత్యంత పురాతనమైనవిగా నిపుణులు చెప్తుంటారు’ అని రామమందిర్ ట్రస్ట్ ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ తెలిపారు.
భూగర్భ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో కూడిన బృందం పలు వారాల పాటు ఆ ప్రాంతంలో పరిశీలన జరిపి, అనువైన ఈ భారీ శిలలను గుర్తించినట్లు జానకి దేవాలయం ప్రధాన మహంత్ రామ్ తాపేశ్వర్ దాస్ తెలిపారు. ఈ నెలాఖరుకు అయోధ్యకు చేరే ఈ శిలలను తాము బహుమతిగా రామాలయంకు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ శిలలు వేలసంవత్సరాలపాటు మన్నికగా ఉంటాయని, భూకంపాలకు సహితం తట్టుకుంటాయని ఆయన చెప్పారు.
ఈ శిలలను బహుకరించడం ద్వారా భారత్ – నేపాల్ ల మధ్య ధార్మిక సంబంధాలు బలోపేతం కాగలవని నేపాల్ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడు బీమాలేంద్ర నిధి విశ్వాసం వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిరం ఉంచడం కోసం శివధనస్సును కూడా బహుకరించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన