
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉండే ‘మొఘల్ గార్డెన్స్’కు ‘అమృత్ ఉద్యాన్’ అని కొత్త పేరు పెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావొచ్చే సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కొత్త నామకారణం చేశారు.15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి, రాష్ట్రపతి భవన్‌కు ఆత్మగా చిత్రీకరించబడే మొఘల్ గార్డెన్స్ పేరును ‘అమృత్ ఉద్యాన్’గా మార్చింది.
మొఘల్, బ్రిటిష్ కాలం నాటి ప్రముఖ కట్టడాలు, నిర్మాణాల పేర్లను ప్రస్తుత మోదీ ప్రభుత్వం క్రమంగా మారుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్ వద్ద ఉండే మొఘల్ గార్డెన్స్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. అరుదైన, అందమైన పుష్ప జాతులతో విలసిల్లే ఈ తోట పేరును ‘మొఘల్ గార్డెన్స్‘ నుంచి ‘అమృత్ ఉద్యాన్’ గా మార్చారు.
దీంతో ఈ గార్డెన్స్ ఇక అమృత్ ఉద్యాన్‌గా పిలవబడుతుంది. భారత రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా మీడియాతో మాట్లాడుతూ మొఘల్ గార్డెన్స్ పేరు మార్చడాన్ని ధృవీకరించారు. “రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యానవనాలు ఇప్పుడు సమిష్టిగా అమృత్ ఉద్యాన్‌గా పిలువబడతాయి” అని ఆమె పేర్కొన్నారు.
జనవరి 29, ఆదివారం నాడు అమృత్ ఉద్యాన్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ తెలియజేశారు. “జనవరి 31 నుంచి మార్చి 31 వరకు రెండు నెలల పాటు ఈ ఉద్యానవనాలు సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంటాయి. మార్చి 28, 29, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల్లోని వారి కోసం ప్రత్యేకంగా తెరిచి ఉంచుతారు. ఇందులో మహిళలు, ఇతర వికలాంగులు ఉన్నారు” అని ఆమె చెప్పారు.
ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఈ సందర్శనకు అవకాశం కల్పిస్తామని, అందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే మొఘల్ గార్డెన్ లో అన్ని మొక్కలకు క్యూ ఆర్ కోడ్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక రంగుల తులిప్ మొక్కలను కూడా అందుబాటులో ఉంచగా.. సందర్శకులకు 20 మంది గైడ్స్ ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.
అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కొవింద్ హయాంలో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త గార్డెన్స్ లో 40 రకాల సువాసనలు వెదజల్లే గులాబీలు ఉండడం విశేషం. అంతే కాదు నలుపు, ఆకుపచ్చ రంగుల గులాబీలు సహా రకరకాల పూలు ఉండడం చెప్పుకోదగిన విషయం.
మొఘల్ గార్డెన్స్ సాధారణంగా ప్రతి సంవత్సరం ఒక నెల ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. సందర్శకులు దీర్ఘచతురస్రాకార, పొడవైన, వృత్తాకార ఉద్యానవనాలు, హెర్బల్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, స్పిరిచ్యువల్ గార్డెన్‌లను సందర్శించవచ్చు. జమ్మూకశ్మీర్ లోని మొఘల్ గార్డెన్, తాజ్ మహల్ ముందున్న మొఘల్ గార్డెన్ తరహాలో ఇది ఉంటుంది.
1917లో సర్ ఎడ్విన్ ల్యూటెన్స్ ఈ మొఘల్ గార్డెన్స్ డిజైన్ ను ఆమోదించారు. అయితే, 1929లో ఇక్కడ పూల మొక్కలను నాటడం ప్రారంభించారు. మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చడాన్ని బీజేపీ ప్రశంసించింది. ఇది మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అభివర్ణించారు. బానిస మనస్తత్వం నుంచి బయటపడేందుకు అమృత కాలంలో తీసుకున్న గొప్ప నిర్ణయమని ఆయన కొనియాడారు.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు