నేటి నుంచే నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పాదయాత్రలు కొంతకాలంగా కీలకంగా మారనున్నాయి. ప్రజలకు దగ్గరై ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి నుండి వరుసగా పలువురు నాయకులు పాదయాత్ర చేబడుతున్నారు. తాజాగా, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన `యువగలం’ పాదయాత్ర శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది.
 
టిడిపి అధినేత, తండ్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహించనున్న కుప్పం నుండి ప్రారంభిస్తున్న ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4,000 కిమీ మేరకు సాగనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా యాత్ర చేస్తున్నారు. తొలిసారి గత ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందిన లోకేష్, తండ్రిచాటు బిడ్డగా పార్టీలో ఆధిపత్యం వహిస్తున్నారని విమర్శల నేపథ్యంలో పజ్రల మద్దతు కోసం ఈ యాత్ర చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
 
కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద పూజలు ముగించుకుని ఉదయం 11.03 గంటలకు లోకేశ్‌ యాత్రను ఆరంభిస్తారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని గురువారం సాయంత్రం 5.42 గంటలకు ఆయన కుప్పం చేరుకున్నారు.
 
టీడీపీ అధినేత చంద్రబాబు మినహా శుక్రవారం నాటి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా రాష్ట్రంలోని 175 నియోజవర్గాల ఇన్‌ఛార్జిలు, ప్రధాన నాయకులు హాజరుకానున్నారు. గురువారం ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖ టీడీపీ నాయకులంతా కుప్పానికి చేరుకోవడం మొదలయింది.
 
పాదయాత్రకు ముందుగా లోకేశ్‌ వరదరాజస్వామి ఆలయంలో పూజలు, లక్ష్మీపురంలోని మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తారు. పోలీసులు రెండు చోట్లా వేర్వేరుగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు ఏఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి సహా మరో ముగ్గురు డీఎస్పీలు, సుమారు 500 మంది పోలీసులు తొలిరోజు బందోబస్తు నిర్వహించనున్నారు.
 
కుప్పం నియోజకవర్గంలో అనేక షరతులతో లోకేశ్‌ పాదయాత్రకు మూడు రోజుల అనుమతి ఇచ్చిన పోలీసులు, అదనంగా మరొక షరతు విధించారు. మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించడానికి లేదని ఆంక్ష పెట్టారు. మొగిలినుంచి బంగారుపాళ్యం వరకు మోటారు సైకిల్‌ ర్యాలీకి మాజీ మంత్రి అమరనాథరెడ్డి అనుమతి కోరారు. అందుకు నిరాకరిస్తూ పలమనేరు డీఎస్పీ సుధాకరరెడ్డి కొత్త షరతును ప్రకటించారు.
 
 జాతీయ రహదారిపై వందలాది వాహనాలు వెళ్తుంటాయని, అలాంటిచోట మోటారు సైకిల్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చేశారు. పలమనేరు పట్టణం, బంగారుపాళ్యంలో బహిరంగ సభలకు పోలీసులు అనుమతులను నిరాకరించారు.
తెలుగు దేశం పార్టీలో తండ్రి వారసుడిగా నాయకత్వం పొందేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ప్రజల నుండి అనుకున్న విధంగా మద్దతు సమీకరించలేక పోవడంతో, తండ్రి తర్వాత టిడిపికి తానే అధినేతను అనే సంకేతం ఇచ్చేందుకు ఈ పాదయాత్ర చేపట్టిన్నట్లు కూడా స్పష్టం అవుతుంది.