కేరళలో కొత్తగా ఓ పాఠశాలలో 62 మందికి నోరో వైరస్

కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగుచూసింది.కక్కనాడ్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2వ తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం లాబోరేటరీకి పంపించామని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి చెప్పారు.

పాఠశాలలో మొత్తం 62 విద్యార్థులు, కొంత మంది తల్లిదండ్రులు ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారని, అందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. వైరస్‌ వ్యాపించకుండా పాఠశాలను 3 రోజుల పాటు మూసివేశారు.  పాఠశాల తరగతి గదులతోపాటు టాయ్ లెట్లలో ఇన్ఫెక్షన్ వెలుగుచూసింది. పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

నోరో వైరస్  నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు రక్షిత మంచినీటిని అందించాలని నిర్ణయించారు. నోరో వైరస్ లక్షణాలు డయేరియా, వాంతులు, స్వల్ప జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పిల్లలు బాధపడుతున్నారు.కలుషితమైన నీరు, ఆహారం వల్ల నోరో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు చెప్పారు.

కేరళ రాష్ట్రంలో 19 మంది పిల్లలకు నోరో వైరస్ పాజిటివ్ అని తేలడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మరుగుదొడ్డికి వెళ్లి వచ్చాక, భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలని వైద్యాధికారులు సూచించారు. క్లోరినేట్ చేసి, కాచిన నీటిని తాగాలని వైద్యులు కోరారు. పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినాలని వైద్యాధికారులు సలహా ఇచ్చారు.

నోరో వైరస్‌నే ‘స్టమక్‌ ఫ్లూ’, ‘స్టమక్‌ బగ్‌’ అని కూడా అంటారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఇద్దరు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యలు తెలిపారు. అనుమానితులందరూ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నోరో వైరస్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు అత్యంత సాధారణ కారణం. ఈ వైరస్ బారిన పడినవారు తీవ్రమైన విరేచనాలు, వాంతులు లాంటి లక్షణాలతో బాధపడతారు.