దిగ్విజయ్ సింగ్ వాఖ్యలపై మండిపడ్డ బీజేపీ

పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు లేవంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఇండియన్ ఆర్మీని, ప్రజలను, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ముఖ్య ఉద్దేశం కూడా దేశ ఐక్యతను దెబ్బతీయడమేనని విమర్శించారు. ”సర్జికల్ దాడులకు ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించలేదని దిగ్విజయ్ చెబుతున్నారు. మన రక్షణ బలగాల శౌర్యాన్ని కాంగ్రెస్ ప్రతీసారి ప్రశ్నిస్తూనే ఉంది. దేశాన్ని కాపాడే బలగాల పట్ల వారికి నమ్మకం లేదు. బాధ్యత లేని ప్రకటనలు చేయడమే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం” అంటూ భాటియా ధ్వజమెత్తారు.

అయితే, భారత సైన్యం గురించి మాట్లాడితే మాత్రం దేశం సహించదని ఆయన హెచ్చరించారు. విపక్ష పార్టీలు ప్రజలకు బాధ్యతగా ఉండాలని హితవు చెప్పారు. సర్జికల్ దాడుల తర్వాతే దేశీయ ఉగ్రవాదం పెరిగందంటూ కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా చెబుతున్నారని, ఇది ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశానికి క్లీన్ చిట్ ఇవ్వడమేనని దయ్యబట్టారు.

రక్షణ బలగాలు ఎప్పుడు తమ శౌర్యం ప్రదర్శించినా కాంగ్రెస్ పార్టీ బాధతో విలవిల్లాడుతుందని భాటియా విమర్శించారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పైనా గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు. ప్రజలను ఐక్యం చేయడం, శాంతి-ప్రేమ సందేశాలను ప్రచారం చేయడం భారత్ జోడో యాత్ర ఉద్దేశమని రాహుల్ చెబుతున్నారని, అయితే ఆ యాత్ర వెనుక భారతదేశాన్ని విభజించే ఉద్దేశం ఉందని స్పష్టం చేయసారు.

ఇందుకు దిగ్విజయ్ తాజా వ్యాఖ్యలే నిదర్శనమని, ఆయన వాడిన భాష చూస్తే అది ‘భారత్ టోడో యాత్ర’ అనే విషయం అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. జమూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిపించే 370 అధికరణను కేంద్రం రద్దు చేయడంపై ఇప్పటికీ విమర్శల దుమారం తగ్గకపోవడాన్ని భాటియా తప్పుపట్టారు.

అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో టూరిజం 3.5 రెట్లు పెరిగిందని, ఉగ్రవాదం 30 శాతం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. రాహుల్ గాంధీ రాజ్యాంగంపై ప్రమాణం చేశారని, కానీ రాజ్యాంగాన్ని చదివిందే లేదని దయ్యబట్టారు. 370 అధికరణపై ఆయన తన వైఖరి ఏమిటో దేశానికి చెప్పాలని భాటియా డిమాండ్ చేశారు.

దేశ ప్రజలంతా బీజేపీ, ఇండియన్ ఆర్మీవైపు ఉన్నారని పేర్కొంటూ నిగ్రహం లేకుండా ప్రకటనలు చేస్తున్న వారు రాజకీయంగా జీరోలనీ, వారి రాజకీయ ఉనికి చిక్కుల్లో పడిందని ఎద్దేవా చేశారు.

విలేకరికి, దిగ్విజయ్‌కు మధ్యలో జైరాం రమేష్

జమ్మూలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుపుతున్న సమయంలో పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ దాడులు జరిపిందనడానికి ఆధారాలు చూపాలని కోరడమే కాకుండాఅసలు సర్జికల్ దాడులకు ఆధారాలే లేవంటూ దిగ్విజయ సింగ్ చేసిన వాఖ్యలు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడవేశాయి. తిరిగి దిగ్విజయ్ సింగ్ సర్జికల్ దాడులపై మీడియా సమావేశంలో మాట్లాడబోతుండగా  మరో పార్టీ నేత జైరాం రమేష్ అడ్డుకున్నారు.

ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు దిగ్విజయ్ సింగ్ వివరణ ఇవ్వబోతుండగా మాట్లాడేదేమీ లేదంటూ విలేకరిని జైరామ్ రమేశ్ అడ్డుకున్నారు. చెప్పాల్సిందేమీలేదంటూ వేగంగా దూసుకొచ్చి మైకును దూరం జరిపారు. విలేకరికి, దిగ్విజయ్‌కు మధ్యలో దూరారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ విలేకరిని బలవంతంగా పంపించారు.