మైనాస్వామికి అరుదైన గుర్తింపు 

చరిత్ర-సంస్కృతి రంగాలకు తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అంతర్జాతీయ సంస్థ ప్రశంసా పత్రాన్ని బెంగళూరులో అందించినట్టు చరిత్రకారుడు- శాసనాల పరిశోధకుడు మైనాస్వామి తెలిపారు. బెంగళూరు ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన కార్యక్రమంలో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కర్ణాటక ఉపాధ్యక్షులు శ్రీమతి వసంత కవిత ప్రశంసా పత్రాన్ని బహూకరించారు.
 
లేపాక్షి జాతీయ సదస్సును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన తరువాత మైనాస్వామికి ఆ గుర్తింపు ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. గత సంవత్సరం డిసెంబర్లో “లేపాక్షి వీరభద్రాలయ వైభవం- ‘యునెస్కో’ శాశ్వత గుర్తింపు ఆవశ్యకత” జాతీయ సదస్సు లేపాక్షి లో నిర్వహించారు. ఈ సదస్సులో పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, చరిత్రకారులు పాల్గొన్నారు.
 
విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయల కాలంలో తెలుగు వైభవం అనే అంశంపై ముఖ్యంగా సదస్సులు నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా పలు సదస్సులు నిర్వహించారు. ఆయన 30 ఏళ్లుగా చరిత్ర సంస్కృతి పై ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు.
 
మైనాస్వామి రచించిన విజయనగర సామ్రాజ్యం వైభవానికి ప్రతీక ‘లేపాక్షి’ అనే పుస్తకాన్ని కి మంచి ఆదరణ లభించింది. విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవం పై ఆంగ్లంలో మైనాస్వామి రాసిన పరిశోధక పుస్తకం ఢిల్లీలో త్వరలో విడుదల కానుంది.