సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం ఝలక్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం షాకిచ్చింది. ఇకపై ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పంద వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు పొందే గిఫ్ట్‌, హోటల్‌ అకామిడేషన్‌, ఈక్విటీ, డిస్కౌంట్స్‌, అవార్డులు, ఎండార్సింగ్‌ ప్రొడక్ట్స్‌, సర్వీస్‌ స్కీమ్‌ వంటి వివరాలను చెప్పాలని పేర్కొంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ‘‘ఎండార్స్‌మెంట్ నో హౌస్’’ పేరుతో కొత్త మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల శాఖ జారీ చేసింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, మోసపూరిత ప్రకటనలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు నూతన నిబంధనలను ప్రకటించింది.

దేశీయంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెట్‌ 2025 నాటికి 20 శాతం వృద్ధి సాధించి రూ.2,800కోట్లకు చేరుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర విభాగానికి చెందిన సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటక్షన్‌ అథారిటీ తప్పుదోవ ప్రకటించే ప్రకటనలపై దృష్టిసారించింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కొత్త నిబంధనలు విధించింది.

ఉత్పత్తులు, సేవలు లేదా పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇకపై అన్ని వివరాలను తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. తాము పొందే బహుమతులు, హోటల్ వసతులు, ఈక్విటీ, డిస్కౌంట్లు, అవార్డులు వంటివాటినన్నిటినీ ప్రకటించాలి.

ఈ నిబంధనలను ఉల్లంఘించే తయారీదారులు, ప్రకటనకర్తలు, ఎండార్సర్స్‌కు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ జరిమానాను విధిస్తుంది. ఈ నిబంధనల ఉల్లంఘన పునరావృతమైతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

అంతేకాకుండా మోసపూరితమైన ప్రకటనలను ఎండార్స్ చేసేవారిని ఒక సంవత్సరంపాటు ఎటువంటి ప్రకటనలను ఎండార్స్ చేయకుండా నిషేధించవచ్చు. అయినప్పటికీ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడినవారిని మూడేళ్లపాటు ఈ విధంగా నిషేధించవచ్చు.  అడ్వర్టయిజర్‌‌కు, సెలబ్రిటీ/ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మెటీరియల్ లింక్ ఉన్నపుడు ఈ విధంగా అన్ని వివరాలను వెల్లడించాలి. సెలబ్రిటీ/ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన రిప్రజెంటేషన్ వల్ల ఆ వస్తువు లేదా సేవ లేదా ఉత్పత్తి విలువ లేదా విశ్వసనీయత ప్రభావితమైనపుడు ఈ నిబంధనలను పాటించాలి.