`దళితబంధు’కు రూపాయి కూడా ఖర్చు చేయని కేసీఆర్

కేంద్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణాలో అమలు చేస్తున్న `దళిత బంధు’ పధకాన్ని దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు దళితులను మోసం చేయడం కోసమే అని బీజేపీ ఎస్సీ మోర్చా  జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ హెచ్చరించారు.  2022-23 బడ్జెట్ లో దళిత బంధు కోసం రూ.17,800 కోట్లు ప్రకటించి, ఈ 10 నెలల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడం తెలంగాణ దళిత సమాజాన్ని వంచించడమేనని ధ్వజమెత్తారు. 

గతంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడేనని ప్రకటించి మాట తప్పిండని, రాష్ట్రంలో నిరుపేదలైన దళితులందరికీ 3 ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి, వాటికి కావలసిన ప్రాథమిక అవసరాలు కల్పిస్తానని ప్రకటించి, మాట తప్పి తెలంగాణ ద్రోహిగా మారిండని విమర్శించారు.
 
అయితే గత సంవత్సరం హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు పథకాన్ని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అమలులో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నదని కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించారని గుర్తు చేశారు.
 
 పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లోని 17వేల దళిత కుటుంబాల బ్యాంకు అకౌంట్లలో ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేసినట్టు ప్రకటించి, తర్వాత ఎన్నికల మార్గదర్శకాల పేరుతో దళితులను మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి1500 మంది చొప్పున దళితబంధు పథకాన్ని మంజూరు చేస్తామని తర్వాత ఆ సంఖ్యను 200కు తగ్గించి దళితులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
 
గతంలో పైలట్ ప్రాజెక్టు కింద యాదాద్రి భువనగిరిలోని వాసాలమర్రితో పాటు మథిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ మండలాలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి, అమలులో మాత్రం ఘోరంగా విఫలమైందని కుమార్ తెలిపారు.
 
రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పేరుతో ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ను ఎస్సీ/ఎస్టీ టి-ప్రైడ్ గా ప్రకటించి ఆ నిధులను కూడా ఎస్సీ, ఎస్టీలకు అందకుండా మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. దళితులను అన్ని రకాలుగా వంచిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని నాయకులను అడుగడుగునా నిలదీయాలని, దళితబంధు అమలు కోసం ఎస్సీ సమాజం ఐక్యంగా పోరాటం చేయాలని కుమార్ పిలుపిచ్చారు.