
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ బాధితులకు రాష్త్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.5లక్షలు అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు భావించిన రెండు హోటల్ భవనాలను తప్ప ఇప్పటి వరకు మరే భవనాన్ని తొలగించలేదని ముఖ్యమంత్రి కార్యదర్శి ఆర్ మీనాక్షి సుందరం తెలిపారు. ఆమె బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు.
కాగా, జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోవడం వల్ల దెబ్బ తిన్న ఇండ్లను ఖాళీ చేస్తున్న కుటుంబాలకు మార్కెట్ రేట్ ప్రకారమే నష్ట పరిహారం చెల్లిస్తామని పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. వివిధ వర్గాలను సంప్రదించిన తర్వాత మార్కెట్ రేట్ను నిర్ణయిస్తామని వెల్లడించారు. అద్దె ఇండ్లలోకి మారే కుటుంబాలకు ఆరు నెలల పాటు నెలకు రూ. 4 వేల చొప్పున కూడా ఇస్తామని చెప్పారు.
జోషిమఠ్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 723 భవనాలకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 131 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.
ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్ వేసినట్లు చెప్పారు.
కాగా, కేంద్ర నిపుణుల బృందం పరిస్థితులను పరిశీలించి, తీసుకోవలసిన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వంకు సూచిస్తుందని, అప్పటి వరకు తాము కేవలం సహాయ, పునరావాస కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతామని జిల్లా అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా, ఉత్తరాఖండ్‌లోని మరో ఐదు ప్రాంతాల్లో కూడా జోషిమఠ్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పౌరి, భగేశ్వర్, ఉత్తర్‌కాశీ, తెహ్రీ గర్హ్‌వాల్, రుద్రప్రయాగ్ ప్రాంతాల్లోని పలు ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది తమ ఇండ్లను వదిలి వేరే చోటకు వెళ్తున్నారు. పలు చిన్న చిన్న కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్