
దేశ రాజధాని ఢిల్లీలో యువతి అంజలి విషాదాంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి తనకు నిజనిర్థారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను సోమవారం ఆదేశించారు.
స్కూటీని ఓ కారు ఢీకొని ఈడ్చుకుని వెళ్లిన ఘటనలో 20 సంవత్సరాల అంజలి సింగ్ కంజావాలా ప్రాంతంలో మృతి చెందింది.ఈ ఘటనపై పలు అనుమానాలు తలెత్తాయి. ఘటనపై దర్యాప్తునకు వెంటనే ప్రత్యేక సిపి షాలీని సింగ్ సారధ్యంలో ఓ బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని అమిత్ షా ఆదేశించారు.
యువతి భౌతికకాయానికి పోస్టుమార్టం జరిగి నివేదిక వెలువడితే మరిన్ని వివరాలు తెలుస్తాయి. దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టి, ఆమె శరీరం కారు కింది భాగంలో చిక్కుకుపోయినా గుర్తించకుండా.. 10-12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఐదుగురు నిందితులకు కోర్టు మూడు రోజుల రిమాండు విధించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పలు విషయాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.
మృతురాలి పేరు అంజలి (23). ఒక ఈవెంట్ సంస్థలో పనిచేస్తున్న ఆమె.. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా ఆమె నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుకవైపు నుంచి కారు ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదం జరగ్గానే కారు దిగి.. ఆమెకు ఏమైందో చూడాల్సింది పోయి.. వారు అక్కడేం జరగనట్టు ముందుకు దూసుకెళ్లిపోయారు! ఆ యువతి కారు కింద పడగానే చనిపోయిందో.. లేక తనను ఈడ్చుకుంటూ ఆ కారు వెళ్తున్న వేగానికి వెన్నెముక విరిగిపోయి, పక్కటెముకలు బయటపడి.. తీవ్రగాయాలపాలై నరకయాతన అనుభవిస్తూ మరణించిందో.. తెలియదు!
తెల్లవారుజామున 3.23 గంటల సమయంలో.. కారు ఈడ్చుకుంటూ వెళ్తున్న ఆ యువతి మృతదేహాన్ని దీపక్ దహియా అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. తెల్లవారుజామున 4.30 సమయంలో.. రోడ్డుపై దుస్తులు లేకుండా, తీవ్రగాయాలతో పడి ఉన్న ఆ యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు.
మరోవైపు పోలీసులు కారు నంబరు ఆధారంగా నిందితులు ఐదుగురినీ పట్టుకున్నారు. వారిని దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), కృష్ణన్ (27), మిథున్ (26), మనోజ్ మిత్తల్ (27)గా గుర్తించి.. వారిపై ఐపీసీ సెక్షన్ 279(ర్యాష్ డ్రైవింగ్), 304-ఏ (నిర్లక్షపూరిత ధోరణితో మరణానికి కారకులు కావడం) కింద కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని మూడురోజులపాటు కస్టడీకి అప్పగించింది.
ఒకరు స్థానిక బిజెపి నేత అని వెల్లడైంది. ఈవెంట్ ఆర్గనైజర్ అయిన అంజలి తన విధులను పూర్తిచేసుకుని స్కూటీపై వస్తుండగా ఐదుగురు వ్యక్తులతో ఉన్న కారు ఢీకొంది. ఈ ఘటనపై ఢిల్లీలో పలు చోట్ల సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. దోషులను శిక్షించాలని ఉద్యమించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు