డివైడ‌ర్‌ను ఢీకొన్న కారు.. క్రికెట‌ర్ పంత్‌కు తీవ్ర గాయాలు

డివైడ‌ర్‌ను ఢీకొన్న కారు.. క్రికెట‌ర్ పంత్‌కు తీవ్ర గాయాలు
భార‌త క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో పంత్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆ త‌ర్వాత ఆ కారులో తీవ్ర స్థాయిలో మంట‌లు చెల‌రేగాయి. బీఎండబ్ల్యూ కారునే స్వ‌యంగా పంత్ న‌డుపుతున్న‌ట్లు తెలిసింది. ఆ సమయంలో మండుతున్న కారు నుంచి .. ఆ కారు అద్దాల్ని ప‌గుల‌గొట్టి .. బ‌య‌ట‌కు దూకిన‌ట్లు పోలీసులు త‌మ రిపోర్ట్‌లో తెలిపారు. ఉత్త‌రాఖండ్‌లోని రూర్కీ వ‌ద్ద పంత్ కారుకు ప్ర‌మాదం అయ్యాయి.
ఇటీవ‌ల బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో ఇండియా నెగ్గిన విష‌యం తెలిసిందే. ఆ జ‌ట్టులో పంత్ కూడా ఉన్నారు. ఆ సిరీస్‌లో 46, 93 ర‌న్స్ స్కోర్ చేశాడ‌త‌ను. కాగా, పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బీబీసీఐ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పంత్‌కు చికిత్స జరుగుతోందని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది.
 అయితే, పంత్‌ నుదురు చిట్లిందని, వీపుపై కాలిన గాయాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతోపాటు కుడి మోకాలి లిగ్మెంట్‌ స్థానభ్రంశమైనట్లు ఎక్స్‌రేల్లో తేలినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందిస్తూ  ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స జరుగుతోందని చెప్పారు.
 ఇప్పటికే పంత్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడానని,  వైద్యులతో కూడా సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. పంత్‌ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామన్న జైషా.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.