ఐరాస హక్కుల సంస్థ నుండి ఇరాన్ తొలగింపు

ఐరాస హక్కుల సంస్థ నుండి ఇరాన్ తొలగింపు

లింగ సమానత్వాన్ని, మహిళా సాధికారతను పెంపొందించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అంతర ప్రభుత్వ సంస్థ నుండి ఇరాన్‌ను తొలగించారు. అంతకుముందు ఇరాన్‌ను తొలగించాలని కోరుతున్న ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది.

ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ఈ నెల 14న ఈ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్‌లో మహిళలు, బాలికలపై అణచివేతను ఉదహరిస్తూ, 2022-2026 పదవీకాలంలో మిగిలిన కాలానికి మహిళా స్థితిగతులపై కమిషన్‌ నుండి ఇరాన్‌ సభ్యత్వాన్ని తొలగించాలంటూ అమెరికా ఈ ముసాయిదాను ప్రవేశపెట్టింది.

తీర్మానానికి అనుకూలంగా రికార్డు స్థాయిలో 29 మంది ఓటు వేశారు. రష్యాతో సహా ఎనిమిది దేశాలు వ్యతిరేకించాయి. కాగా భారత్‌, బంగ్లాదేశ్‌తో సహా 16 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబరు నుండి ఇరాన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఆర్థిక, సామాజిక మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా మహిళలు, బాలికల మానవ హక్కులను ఇరాన్‌ కాలరాస్తోందని మండలి పేర్కొంది. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఇరాన్‌ను తొలగించాలని తీర్మానించింది. సెప్టెంబరు 16న ఇరాన్‌ మొరాలిటీ పోలీసుల నిర్బంధంలో 22ఏళ్ళ మషా అమిని అనే యువతి మరణించినప్పటి నుండి ఇరాన్‌లో తీవ్రంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. వాటిపై ఇరాన్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.