జమా మసీదులోకి ఒంటరి మహిళల ప్రవేశం నిషేధంపై దుమారం! 

మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తు దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మజీద్ కీలక ప్రకటించడంతో దుమారం చెలరేగింది.  ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్లు వెంట లేకుండా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు జమా మసీద్ మాస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

ఈ నిర్ణయంపై మహిళా సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ‘ఇదేమన్నా ఇరాన్‌ అనుకుంటున్నారా?’ అంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజించే హక్కు పురుషుడికి ఎంత ఉందో.. స్త్రీకి అందే ఉందని ఆమె స్పష్టం చేశారు.

చివరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మసీదు షాహీ ఇమామ్‌ బుఖారీతో ఫోన్లో మాట్లాడి మసీదులోకి అమ్మాయిల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరడంతో   ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మసీద్ ను సందర్శించేవారు అక్కడి పవిత్రతను కాపాడగలరనే హామీపై తమ ఉత్తరువును ఉపసంహరించు కొంటున్నట్టు ప్రకటించారు. మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు తమ కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలని స్పష్టం చేస్తూ కొద్దిరోజుల క్రితమే మసీద్ ఎంట్రన్స్ గేట్ల వద్ద నోటీస్ అంటించడంతో వివాదం చెలరేగింది. 

అయితే, ఆ నోటిస్ పై తేదీ లేదు. ఈ విషయమై గురువారమే వివాదం చెలరేగింది. జమా మసీద్ కమిటీ నిర్ణయాన్ని మసీద్ పీఆర్‌వో సబివుల్లా ఖాన్ సమర్థించారు. ప్రార్థనల కోసం వచ్చిన వారికి ఇబ్బంది కలిగించేలా సోషల్ మీడియా కోసం మహిళలు వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 

కుటుంబాలు లేదా దంపతులపై ఎలాంటి నిషేధంలేదని స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయం నమాజ్ కోసం వచ్చేవారికి వర్తింపదని, కేవలం సందర్శకులకు మాత్రమే అని షాహీ ఇమామ్ గురువారం వివరణ ఇచ్చారు.  ఈ ప్రాంగణం పవిత్రతకు భంగం కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండడంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారి తెలిపారు. 

కొందరు యువతులు ఒంటరిగా వచ్చి, తమ ప్రియులకు వేచి ఉండడం ఉంటున్నారని చెబుతూ, ఈ ప్రదేశం అటువంటి కార్యకలాపాల కోసం కాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ముమ్మాటికీ పురుషాహంకారమే అని  స్వాతి మలివాల్‌  మండిపడ్డారు. జామా మసీదు షాహీ ఇమామ్‌ చేసిన తాలిబానీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ నోటీసు జారీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. మసీదులో మహిళలు స్వేచ్ఛగా ప్రవేశించకుండా, వారి మతాన్ని ఆచరించకుండా నిరోధించడం పూర్తిగా వివక్షతతో కూడుకున్నదని ఆమె స్పష్టం చేశారు.  

లింగంతో సంబంధం లేకుండా ప్రార్థనా స్థలాను ప్రతి ఒక్కరికీ తెరిచి ఉంచాలని ఆమె సూచించారు. ఇటువంటి ఉత్తర్వులు స్త్రీ ద్వేషపూరితమైనవే కాకుండా భారత రాజ్యాంగం ధర్మానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.