మల్లారెడ్డిపై ఈడీ దర్యాప్తుకై ఐటీ అధికారుల సిఫార్సు 

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండున్నర రోజుల పాటు పన్ను ఎగవేత, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు  ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారించినట్లు తెలుస్తున్నది. ల్యాప్‌ట్యాప్‌ వ్యవహారం, అధికారులపై దాడి అంశాలపై సీరియస్‌ అయ్యారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికతో ఈడీకి ఐటీ లేఖ రాసింది. 
 
సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి అధికారులు పంపించారు. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై పూర్తిస్థాయి వివరాలు తెలియాలంటే  ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. 
 
మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.   మల్లారెడ్డి, ఆయన భార్యతో పాటు, కాలేజీల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్‌, ఇతర సిబ్బంది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, అధిక ఫీజుల వసూళ్లు, క్యాష్‌ పేమెంట్ల వివరాలు, వాటిని బ్యాంకుల్లో భద్రపర్చక పోవడానికి కారణాలను ఆరా తీసినట్లు సమాచారం.
మల్లారెడ్డి గ్రూప్‌‌ ఆఫ్‌‌ కంపెనీస్‌‌లో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బ్లాక్‌‌మనీని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. మంత్రికి చెందిన16కు పైగా కంపెనీల్లో జరిపిన తనిఖీల్లో రూ.వందల కోట్ల హవాలా ట్రాన్సాక్షన్స్‌‌ గుట్టు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి సహా సంబంధిత కంపెనీలకు చెందిన 16 మంది డైరెక్టర్లకు గురువారం ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28, 29వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆర్థిక లావాదేవీలకు చెందిన డాక్యుమెంట్స్‌‌ను తీసుకురావాలని స్పష్టం చేసింది.
 
మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడుతో పాటు సన్నిహితులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఆస్తుల లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై వీరందరిని ఐటీ అధికారులు విచారించనున్నారు. విద్యాసంస్థల్లో డొనేషన్లపై ప్రధానంగా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐటీ అధికారులు రెండు నెలలుగా మంత్రి మల్లారెడ్డి లావాదేవీలపై నిఘా పెట్టినట్లు తెలిసింది. 
 
అన్ని ఆధారాలు సేకరించాకే.. వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. కాలేజీ ఫీజుల వసూళ్లు.. వాటిని స్థిరాస్తులకు మళ్లించడం.. ఇతర వ్యాపారాలు వంటి అంశాలపై అధికారులు ముందుగానే ఓ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకుని, దాడులకు చేసినట్లు తెలిసింది.
 
 రెండు నెలల క్రితం మంత్రి మల్లారెడ్డి భూవ్యవహారాలు చూసే ఓ వ్యక్తిపై డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి బ్లాక్‌ మనీతో ఐటీ అధికారుల వద్ద భూమి కొనేలా డీల్‌ కుదుర్చుకున్నాక.. అన్ని ఆధారాలు సేకరించాకే ఈ దాడులను ప్రారంభించినట్లు సమాచారం.