ప్రజాస్వామిక చర్చల తర్వాతే ఉమ్మడి పౌరస్మృతి

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. అయితే ప్రజాస్వామిక ప్రక్రియలో, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం టైమ్స్‌ నౌ  చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
 
భారతీయ జన్‌సంఘ్‌ కాలం నుంచీ ఉమ్మడి పౌరస్మృతి అమలు తమ డిమాండ్‌ అని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగ సభ కూడా ఏదో ఒక సమయంలో దీనిని అమలు చేయాలని పార్లమెంటు, అసెంబ్లీలకు సిఫారసు చేసిందని పేర్కొంటూ అయితే ఆ తర్వాత ఆ విషయాన్ని విస్మరించారని ఆక్షేపించారు. బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా పౌరస్మృతికి అనుకూలంగా లేదని పేర్కొన్నారు.
 
దీనిపై ప్రజాస్వామికంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అమిత్ షా  ఆకాంక్షించారు. ఉమ్మడి పౌరస్మృతిపై హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల సారథ్యంలో కమిటీలు వేశారని చెబుతూ అన్ని వర్గాలూ తమ అభిప్రాయాలను వాటికి తెలియజేస్తున్నాయని తెలిపారు. 
 
లౌకికవాద దేశంలో చట్టాలు మత ప్రాతిపదికన ఉండరాదని అభిప్రాయపడ్డారు. కుల వాదం, వారసత్వం, బుజ్జగింపు విధానాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయాలను విముక్తి చేశారని హోమ్ మంత్రి కొనియాడారు. పనితీరు ఆధారిత రాజకీయాలను ప్రారంభించారని చెబుతూ ఎవరు బాగా పనిచేస్తే వారే దేశాన్ని పాలిస్తారని తెలిపారు. 
 
పుట్టుక, కులం ఆధారంగానో, ఒకానొక వర్గాన్ని బుజ్జగించడం ద్వారానో పాలించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. 
 
వాటిపై ఎవరికైనా ఇబ్బందులుంటే కోర్టులను ఆశ్రయించవచ్చని ఆయన సూచించారు. శ్రద్ధా వాకర్‌ హంతకుడికి కఠిన శిక్ష విధించేందుకు ఢిల్లీ పోలీసులు, ప్రాసిక్యూషన్‌ తగు చర్యలు తీసుకుంటాయని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిందని,  గుజరాత్‌లో కఠినంగా అమలు చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. 
 
గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సతోనే తమకు పోటీ అని చెబుతూ  సీట్లు, ఓటింగ్‌ శాతంలో గత రికార్డులన్నీ చెరిపేస్తామని ధీమాగా చెప్పారు. హిమాచల్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 
 
ఢిల్లీ  కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టను అప్రదిష్టపాలు  చేసే విధంగా బిజెపి ప్రయత్నిస్తున్నట్లు ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ ఇతరులపై అపవాదులు వేసేముందు విడుదలైన వీడియోలు వాస్తవమా? కాదా? చెప్పమనండి అంటూ చురకలు అంటించారు. 
 
కాగా, సీఏఏ ఇప్పటికే ఆమోదం పొందిందని చెబుతూ దానిని వెనుకకు తీసుకొంటామని లేదా అమలు చేయకుండా ఉంటామని ఎవ్వరు కలలు కనవద్దని హితవు చెప్పారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా దాని అమలు ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని, త్వరలోనే ఆ పక్రియ పూర్తవుతుందని చెప్పారు. వాటికి నిబంధనలను కూడా రూపొందించామని గుర్తు చేశారు.