హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు

క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాల‌ను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో నిందితుడు షారీక్‌ కు సంబంధాలు ఉన్న‌ట్లు తేల్చారు. ఈ క్ర‌మంలో కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ (ఎన్ఐఏ)కు అప్ప‌గిస్తున్న‌ట్లు క‌ర్ణాట‌క డీజీపీ ప్ర‌వీణ్ సూద్ మీడియాకు వెల్ల‌డించారు.

శనివారం రోజు క‌దులుతున్న ఆటోలో పేలుళ్లు సంభ‌వించిన విష‌యం విదిత‌మే. దీంతో అక్క‌డ భారీగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. అనంత‌రం వెహిక‌ల్ నుంచి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ పేలుడు ఘ‌ట‌న అంతా అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘ‌ట‌న‌ను మొద‌ట ప్ర‌మాదంగా భావించారు.

కానీ ఆదివారం డీజీపీ ప్ర‌వీణ్ మాట్లాడుతూ ఈ పేలుళ్ల‌తో ఉగ్ర‌వాదుల‌కు సంబంధం ఉంద‌ని తేల్చారు. దీనిపై లోతైన విచార‌ణ జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. త‌క్కువ సామ‌ర్థ్యం ఉన్న ఐఈడీ పేలిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే నిందితుడు షారిక్ ఆటోలో కుక్కర్‌లో బాంబును త‌ర‌లిస్తుండ‌గా ఈ పేలుడు జ‌రిగింది.

ప్రేమ్ రాజ్ పేరుతో ఆధార్ కార్డు 

కాగా, 24 ఏళ్ళ నిందితుడు శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన వ్యక్తి. అయితే పేలుడు తర్వాత అతని వద్ద హుబ్బళికి చెందిన ప్రేమ్ రాజ్ హుతాగి పేరుతో ఆధార్ కార్డును పోలీసులు కనుగొన్నారు. గతంలో ఓ ఉగ్రవాద సంబంధం కేసులో అరెస్ట్ అయి, హైకోర్టు నుండి బెయిల్ పొందిన తర్వాత వేర్వేరు హిందూ పేర్లతో కన్యాకుమారి,  కోచి, కోయింబత్తుర్, మైసూరు తదితర పేర్లతో ఆశ్రయం తీసుకున్నాడని వెల్లడైన్నట్లు రాష్త్ర హోమ్ మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర తెలిపారు.

పేలుడు జరిగిన సమయంలో మైసూరులోని మోహన్ కుమార్ ఇంట్లో ఉంటున్నాడు. అక్కడనే  బాంబు తయారీకి సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను బళ్లారికి చెందిన ఓ హిందూ  పేరుతో సిమ్ కార్డు వాడుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కోయింబత్తుర్ లోని ఇషా ఫౌండేషన్ లో గల శివుడి స్థూపం బొమ్మను తమ వాట్స్ అప్ బొమ్మలో ఉంచాడు.

మైసూర్ లో ఉన్న సమయంలో ఉర్దూ వాసనలు లేకుండా కన్నడంలోనే మాట్లాడేవారని, తాను ముస్లిం అని బైట పడకుండా ఉండేందుకు అన్ని హిందూ పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకొనేవాడని పోలీసులకు వెల్లడైనది.

షారిక్‌పై మూడు కేసులు న‌మోదు అయ్యాయి. ఒక కేసు శివ‌మొగ్గ‌లో, మ‌రో రెండు కేసులు మంగ‌ళూరులో న‌మోదైన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. షారిక్ ఉంటున్న ఇంట్లో చాలా వ‌ర‌కు పేలుడు ప‌దార్థాలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. కొన్నింటిని ఆన్‌లైన్‌లో, కొన్ని ఆఫ్‌లైన్‌లో కొన్న‌ట్లు గుర్తించారు.

ఇస్లామిక్ ఉగ్ర‌వాద సంస్థ‌తో షారిక్ ప‌నిచేశాడ‌ని, ఆ సంస్థ‌కు చెందిన అల్ హింద్ అనే గ్రూపుతో అత‌నికి లింకులు ఉన్న‌ట్లు తేల్చారు. అరాఫ‌త్ అలీ అనే వ్య‌క్తితో షారిక్‌కు సంబంధాలు ఉన్నాయ‌న్నారు. అల్ హింద్ మాడ్యూల్ కేసులో ఆ ఇద్ద‌రూ నిందితులే. షారిక్‌తో లింకున్న వారిని గుర్తిస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు.

ఈ కేసులో తాము సీరియస్ గా దర్యాప్తు చేపట్టామని చెబుతూ  తమిళనాడు, కేరళ డీజీపీలతో తాము టచ్ లో ఉన్నామని,  నిందితుడు మహ్మద్ షరీఖ్ వెనక ఎవరు ఉన్నారనే దానిపై కూపీ లాగుతున్నామని తెలిపారు. కొన్ని వర్గాల మధ్య గొడవలు సృష్టించడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమని డీజీపీ స్పష్టం చేశారు. 

ఈ కేసులో ఎన్ఐఏ సహా సెంట్రల్ ఏజెన్సీలు భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు. నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇందులో వాస్తవాలు తేల్చేందుకు కొంత సమయం పడుతుందని ప్రవీణ్ సూద్ వెల్లడించారు.

బాంబ్ పేలుడుకేసులో కీలక సూత్రధారితో సన్నిహితంగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. షరీఖ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి..? ఇంకా ఎవరెవరితో పరిచయముంది అన్న అంశాలపై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించింది. దీని వెనుక ఉగ్రసంస్థలు ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించింది.