సీబీఐకి నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు

గతంలో రాజకీయ దుమారం రేపిన నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 13న నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జరిగిన దొంగతనంలో కేవలం కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం కావడం అప్పట్లో కలకలం రేపింది.
ఆ తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని, అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే మంచిదని, అప్పుడే వాస్తవాలు బయటపడతాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఓ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా సుమోటో పిల్‌గా పరిగణించి, మొత్తం 18 మందిని ప్రతివాదులుగా హైకోర్టు చేర్చింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై టిడిపి ప్రభుత్వ కాలంలో అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు.

వెంటనే స్పందించిన చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు నకిలీ అని ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరులోని కోర్టులో ఆ పత్రాల చోరీ జరగడం రాజకీయంగా వివాదం రేపింది.

నెల్లూరులో ఉన్న కోర్టు సముదాయంలో 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు కూడా ఉంది. ఈ క్రమంలో కోర్టులో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడినట్లు కోర్టు సిబ్బంది గమనించారు. చోరీ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఈ దొంగతనం కేసులో కోర్టు నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకువెళ్లారని ఆరోపణలు వచ్చాయి.
కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం అయ్యాయని గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఫైళ్లు మాయం కావడంపై సోమిరెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో తాను సీబీఐ విచారణకైనా సిద్ధమని గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత హైకోర్టులో విచారణ జరగ్గా  ఇప్పుడు సీబీఐకు ఈ కేసు విచారణను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.