న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ విజేతగా టీమ్ ఇండియా

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న‌ మూడు టీ 20 సిరీస్‌ను భార‌త‌జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. వ‌ర్షం కార‌ణంగా మూడో టీ20ని అంపైర్లు టైగా ప్ర‌క‌టించారు. దాంతో, రెండో టీ 20లో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ విజేత‌గా నిలిచింది.  161 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇండియా 9 ఓవ‌ర్లు ముగిసే వ‌ర‌కు నాలుగు వికెట్ల న‌ష్టానికి 75 ర‌న్స్ చేసింది. అయితే ఆ స‌మ‌యంలో వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్‌ను నిలిపేశారు.
డక్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం 9 ఓవ‌ర్ల‌కు భార‌త జ‌ట్టు 75 ప‌రుగుల చేయ‌డంతో మ్యాచ్‌ను టైగా ప్ర‌క‌టించారు.  మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవ‌ర‌ల్లో 160 ప‌రుగుల‌కు అలౌట్ అయింది. కాన్వే, ఫిలిప్స్ హాఫ్ సెంచ‌రీల‌తో న్యూజిలాండ్‌కు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్‌ను అందించారు. కాన్వే 59, ఫిలిప్స్ 54 ర‌న్స్ చేశారు.
 
నిజానికి భారీ స్కోర్ దిశ‌గా వెళ్తున్న కివీస్‌ను భార‌త బౌల‌ర్లు అడ్డుకున్నారు. మూడ‌వ వికెట్‌కు కాన్వే, ఫిలిప్స్ మ‌ధ్య కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొన్న‌ది. ఆ ఇద్ద‌రూ మూడో వికెట్‌కు 86 ర‌న్స్ జోడించారు.
 
భారత బౌల‌ర్ల‌లో సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ నాలుగేసి వికెట్లు తీశారు. నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లండ్‌ను దెబ్బ‌తీసిన మ‌హమ్మ‌ద్ సిరాజ్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక‌య్యాడు. ఈ సిరీస్‌లో మెరుపు సెంచ‌రీతో క‌లిపి 127 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ద‌క్కింది. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి ఇది భార‌త్‌కు ప‌దో సిరీస్ విజ‌యం.