భారత్, బ్రిటన్ లతో ఆస్ట్రేలియా స్వేచ్ఛా వాణిజ్యం

భారత్‌, బ్రిటన్‌లతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఆస్ట్రేలియా పార్లమెంట్‌ మంగళవారం ధ్రువీకరించింది. దీంతో ఈ ఒప్పందాలను అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయా భాగస్వామ్య దేశాలపైనే వుంది. సమస్యాత్మకంగా వున్న చైనా మార్కెట్ల నుంచి తన ఎగుమతులను భారత్‌, బ్రిటన్‌లకు మార్చాలంటే ఆస్ట్రేలియాకు ఈ ఒప్పందాలు చాలా కీలకం.
 
యురోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేసినందున బ్రిటన్‌ కొత్తగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కుదుర్చుకోవాల్సిన అవసరం వుంది. సోమవారం ప్రతినిధుల సభ ఈ బిల్లులను వెంటనే ఆమోదించింది. మంగళవారం సెనెట్‌ ఆమోదముద్ర తెలియజేయడంతో చట్టాలుగా మారాయి.
 
“భారత్ తో మా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మా పార్లమెంట్ ఆమోదం పొందింది” అని తెలుపుతూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బన్స్ ట్వీట్ చేశారు. అందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ చర్యను భారతీయ వాణిజ్య సముదాయం విశేషంగా స్వాగతిస్తుందని చెప్పారు. ఇది భారత్ – ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జనవరి, 2023 నుండి అమలులోకి రాగలదని భావిస్తున్న ఈ ఒప్పందం క్రింద  ఆస్ట్రేలియా- భారత్ ల మధ్య వాణిజ్యం వచ్చే ఐదేళ్లలో ప్రస్తుతం 31 బిలియన్ డాలర్ల మేరకు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపు అయి 45 నుండి 50 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందంపై రెండు దేశాలు ఏప్రిల్ 2న సంతకాలు చేశాయి.
 
జౌళి, చర్మ వస్తువులు, ఫర్నిచర్, బంగారు ఆభరణాలు, మెషినరీ తదితర భారతీయ ఉత్పత్తులు సుమారు 6,000 మేరకు ఆస్ట్రేలియా మార్కెట్ లో ఎటువంటి సుంకాలు లేకుండా అమ్మే వీలు ఏర్పడుతుంది. ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవసాయ ఉత్పత్తులు, పాదరక్షలు, విద్యుత్ పరికరాలు, క్రీడా వస్తువులకు సహితం మార్కెట్ సౌకర్యం కలుగుతుంది.
అయితే, భారత్‌, బ్రిటన్‌ పార్లమెంట్లు ఇప్పటి వరకు వీటిని ధ్రువీకరించలేదు. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్‌ ఫారెల్‌ మాట్లాడుతూ, నాణ్యత కలిగిన ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యానికి కట్టుబడి వున్నట్లు భారత్‌ తెలిపిందని పేర్కొన్నారు.
 
భారత్‌తో సన్నిహిత ఆర్థిక సంబంధాలు ప్రభుత్వ వాణిజ్య వైవిధ్యీకరణ వ్యూహంలో కీలకమని ఫారెల్‌ వ్యాఖ్యానించారు. తమ అభివృద్ధిని పెంపొందించుకునేందుకు బ్రిటీష్‌ ఒప్పం దం కూడా చాలా కీలకమని తెలిపారు. ఆస్ట్రేలియా – బ్రిటన్‌ ఒప్పందం కింద 99 శాతానికి పైగా ఆస్ట్రేలియా ఉత్పత్తులు పన్ను రహితంగా వుంటాయి.
 
మారిషస్, యుఎఇల తర్వాత భారత్ ఇటువంటి ఒప్పందం చేసుకున్న మూడో దేశం ఆస్ట్రేలియా కావడం గమనార్హం. ఆస్ట్రేలియా ఈ విధమైన ఒప్పందం చేసుకున్న మొదటి దేశాలలో భారత్ ఒకటని చెబుతూ, దీని వల్లన మనదేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.