అంతర్జాతీయ విమాన ప్రయాణీకులకు కరోనా డిక్లరేషన్ అవసరం లేదు 

భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కరోనా  వ్యాక్సినేషన్‌కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో పూరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్‌లో గణనీయమైన పురోగతి కొనసాగుతున్నందున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించినట్లు అందులో పేర్కొంది.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ సువిధ పోర్టల్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల అనుగుణంగా ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది.
కాగా, భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తమ వ్యాక్సినేషన్‌ స్థితి, టీకా డోసులు ఎన్ని వేయించుకున్నారో అన్నది తప్పని సరిగా ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో వెల్లడించాలి. అయితే ఇకపై ఆ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని విమానయాన మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే, ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతనే భారత్‌కు రావడం మంచిదని పేర్కొంది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను ఇటీవల కేంద్రం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ‘ఎయిర్‌ సువిధ’ నిబంధనను ఎత్తివేసినప్పటికీ కొన్ని అంశాలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కేంద్రం పేర్కొంది. ప్రయాణ సమయంలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని, మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని చెప్పింది.