మాజీ ప్రధాని వాజ్‭పేయి బయోపిక్ లో పంకజ్ త్రిపాఠి

మాజీ ప్రధాని వాజ్‭పేయి బయోపిక్ లో పంకజ్ త్రిపాఠి
దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి బయోపిక్ లో  బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే పంకజ్‌ త్రిపాఠి అటల్‌ బిహారీ వాజ్‌పేయిగా నటిస్తే ఆ పాత్రకు న్యాయం చేయగలరని నిర్మాతలు భావిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని వినోద్‌ భన్సాలీ, సందీప్ సింగ్‌ నిర్మించనున్నారు. ఈ బయోపిక్‌కు ‘మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే-అటల్‌’ అనే టైటిల్‌ పెట్టారు.  ఉల్లేక్‌ ఏన్‌పీ రాసిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి, పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
ఈ రామ్ గురించి గత జూన్ లో ప్రకటించగా, వాజపేయి గా ఎవ్వరు  నటిస్తారో అన్న ఆసక్తి కొనసాగుతూ వస్తోంది. రవి జాదవ్ దర్శకత్వం వహిస్తారు.  ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తారు. ఇంతకు ముందు ఆయన ప్రముఖ మరాఠీ సినిమాలు నట్‌రంగ్, బాలక్ పాలక్, బాలగంధర్వ, టైమ్‌పాస్ వంటి పలు సినిమాలు తీశారు. 
 
వచ్చే ఏడాది డిసెంబర్ 25న అటల్ జయంతి సందర్భంగా ఆయన బయోపిక్ ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాను ఈ బయోపిక్ లో నటిస్తుండటంతో చాలా ఆనందంగా ఉందని పంకజ్ త్రిపాఠి చెప్పారు. ఇది తనకు ఓ గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. వాజపేయి కేవలం ఒక రాజకీయ వేత్త మాత్రమే కాకుండా, గొప్ప రచయిత అని, అంతకు మించి అద్భుతమైన కవి అని గుర్తు చేశారు. ఇటువంటి అవకాశం లభించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
 
అటల్ బిహారీ వాజ్ పేయి 1998 నుంచి 2004 వరకు ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. బీజేపీ నుంచి మొట్టమొదటి దేశ ప్రధాని అయిన వ్యక్తిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.  మొత్తం మూడు సార్లు ప్రధానిగా పనిచేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యునిగా, బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాలలో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించారు. 
 
దేశంలోని ప్రముఖ నాయకులలో ఒకరైన వాజ్ పేయి అనారోగ్యం కారణంగా 2018, ఆగష్టు 16న ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు. 2015లో ఆయన్ను భారతరత్నతో కేంద్రం సత్కరించింది. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పండిట్ గోవింద్ బల్లభ్ పంత్ అవార్డును కూడా వాజ్ పేయి అందుకున్నారు.