గుజరాత్‌లో మరోసారి అధికారంలోకి బిజెపి

గుజరాత్‌లో  ఎన్నికల రికార్డులను బద్దలు కొట్టి అఖండ మెజారిటీతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తిరిగి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తూ బీజేపీకి గుజరాత్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన చెప్పారు. 

న్యూస్ 18 ఇండియా నిర్వహించిన  ప్రత్యేక కార్యక్రమం ‘గుజరాత్  అధివేషన్’లో పాల్గొన్న అమిత్ షా  నెట్‌వర్క్ 18 ఎండి, గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ముఖాముఖిలో పలు అంశాలపై స్పందించారు.  గుజరాత్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలుగా కృషి చేసిందని ఆయన  చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర ప్రజల అంచనాలను అందుకుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన తనశైలిలో విమర్శలు గుప్పించారు.

ఒకప్పుడు గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరంలో 250 రోజులు కర్ఫ్యూ ఉందని గుర్తు చేశారు. కానీ ఈ రోజు 20 ఏళ్ల కుర్రాడిని కర్ఫ్యూ అంటే ఏమిటని అడిగితే  అతడు చెప్పలేడని, ఆ యువకుడు బీజేపీ పాలనలో అసలు కర్ఫ్యూను చూడలేదని బదులిచ్చారు. 

తాము కొన్ని సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వంతో సురక్షితమైన, బాగా అభివృద్ధి చెందిన, విద్యావంతులైన గుజరాత్‌ను తయారు చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో అనేక రంగాల్లో ప్రగతి సాధించామని చెప్పారు. అందుకే గుజరాత్ ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెబుతూ రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్ల శాతం పెరుగుతుందని,  సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు.

గుజరాత్ ఏ తృతీయ పక్షాన్ని అంగీకరించలేదు 

రాష్ట్రంలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆప్ నాయకులు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ గుజరాత్ ఏ తృతీయ పక్షాన్ని ఎన్నడూ అంగీకరించలేదని అమిత్ షా గుర్తు చేశారు.  గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ  ప్రభుత్వం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో మరోసారి ఏర్పాటు  కానుందని భరోసా వ్యక్తం చేశారు. 

గుజరాత్‌లో ఎమ్మెల్యేల టిక్కెట్టుపై కోత పెట్టడంపై స్పందిస్తూ ప్రతిసారీ 30 శాతం మంది ముఖాలు మారుతున్నాయని తెలిపారు. ఎప్పుడూ ఒకే ముఖం ఉండేది కాదని చెప్పారు. తాము రికార్డులు బద్దలు కొట్టే రాజకీయాలు చేయడం లేదని, గుజరాత్ ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇక్కడ శాంతిభద్రతల గోడను నిర్మించిందని తెలిపారు. 

స్టేడియం పేరు మార్పుపై ఎద్దేవా 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే నరేంద్ర మోదీ పేరుతో ఉన్న స్టేడియం పేరును మారుస్తామని, దీనికి సర్ధార్ పటేల్ పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంపై  అమిత్ షా ఎద్దేవా చేశారు. అసల సర్దార్ పటేల్ పేరును ఉచ్చరించే హక్కు కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శించారు

గాంధీ-నెహ్రూ కుటుంబం సర్ధార్ పటేల్‌కు పేరు దక్కకుండా చేసేందుకు ఎంతో ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. కనీసం అంత్యక్రియల నుండి స్మారక చిహ్నం, ఆయనకు భారతరత్న వంటి అంశాల వరకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన వాళ్లు ఎన్నో అడ్డంకులు సృష్టించారని, అలాంటి వాళ్లు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.

కామన్ సివిల్ కోడ్‌ పై రాజకీయం ఎందుకు?

కామన్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఉమ్మడి సివిల్ కోడ్ హామీ ఈనాటిది కాదని, పాతదని చెప్పారు. దీనిపై రాజకీయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ సివిల్ కోడ్‌కు అనుకూలమా ? వ్యతిరేకమా ? చెప్పాలని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.

తాము ఎన్నికలకు ముందు ఏం చెప్పామో అవన్నీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.  గతంలో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపు హామీని తాము నెరవేర్చామని, అదే విధంగా రామమందిరం నిర్మాణం మాటపై కట్టుబడి పనిచేస్తున్నామని గుర్తు చేశారు.  

ఓట్ల కోసం ఉచితాలను పంచిపెట్టడం సరికాదని.. జీవన ప్రమాణాలు పెంచేందుకు ఒక్కసారే సాయం చేయడం వేరు అని కేంద్ర హోంమంత్రి తెలిపారు.