పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ఫీజు 

పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ఫీజు 
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును  చెల్లిస్తామని ప్రకటించింది. బీసీసీఐతో కాంట్రాక్టు కుదుర్చుకునే సీనియర్ పురుష క్రికెటర్లతో సమానంగా ఇకపై మహిళా క్రికెటర్లు కూడా మ్యాచ్ ఫీజును పొందుతారని స్పష్టం చేసింది.  
 
టెస్ట్ మ్యాచ్ ఫీజు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ ఫీజు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలను ఇకపై మహిళా క్రికెటర్లు కూడా తీసుకుంటారని వెల్లడించింది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి  జై షా ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.
స్త్రీలపై వివక్షను నిర్మూలించే దిశగా, లింగ సమానత్వాన్ని సాధించేందుకే బీసీసీఐ ఈ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
భారతీయ క్రికెట్‌లో ఇదొక సరికొత్త అధ్యాయమని, ఇకపై లింగ భేదం లేదని, పురుష క్రికెటర్లు, మహిళా క్రికెటర్లు ఇద్దరూ సమానమేనని చాటి చెప్పేందుకు సమాన వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు జై షా ట్వీట్ చేశారు. 
ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో తనకు మద్దతు పలికిన బీసీసీఐ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కూడా ఇదే విధమైన  నిర్ణయాన్ని తీసుకుంది.   బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై స్త్రీ అభ్యుదయ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై టీమిండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేసింది. టీమిండియా మహిళా జట్టు క్రికెట్‌లో ఇదొక చారిత్రక నిర్ణయం అని, ఈ కలను నిజం చేసినందుకు జై షాకు, బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు తనకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.