రక్షణ రంగంలో స్వావలంబన సాధనకు ప్రాధాన్యత 

రక్షణ రంగంలో స్వావలంబన సాధనకు ప్రాధాన్యత 

రక్షణ రంగంలో స్వావలంబన సాధించి, రక్షణ పరికరాల ఎగుమతులు ఎక్కువ చేయడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో  రక్షణ రంగంలో  స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో రక్షణ మంత్రిత్వ శాఖ అనేక చర్యలు అమలు చేస్తోంది.

 ‘ఆత్మ నిర్భర్ భారత్’  లక్ష్య సాధనలో భాగంగా సానుకూల ధోరణి అవలంభిస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ అనేక ఉత్పత్తులను స్వదేశంలో అభివృద్ధి చేసే అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. స్వదేశంలో ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్న వస్తువులను రక్షణ మంత్రిత్వ శాఖ  గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించింది. 

స్వదేశంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్న వస్తువులతో రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసింది. 2020 ఆగస్టు 21, 2021 మే 31, 2022 ఏప్రిల్ 07 తేదీల్లో 310 వస్తువులతో మూడు జాబితాలు విడుదల అయ్యాయి. తాజాగా 4వ జాబితాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో 2022 లో విడుదల చేశారు.

జాబితాలో పొందుపరిచిన వస్తువులను డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం  రక్షణ మంత్రిత్వ శాఖ స్వదేశీ సంస్థల నుంచి సేకరిస్తుంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజు నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన స్వావలంబన సాధించేందుకు  రక్షణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యలు ప్రస్తావించారు. వస్తువుల సేకరణ కోసం ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖను ప్రధానమంత్రి అభినందించారు.

రక్షణ రంగంలో ‘ఆత్మ నిర్భరత’ సాధనకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అన్నారు. రాబోయే కాలంలో రక్షణ వస్తువుల ఎగుమతులు పెరుగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  పరిశ్రమ వర్గాల తో సహా సంబంధిత వర్గాలతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ స్వదేశంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్న వస్తువుల వివరాలతో  4వ జాబితా సిద్ధం చేసింది.  పరికరాలు/వ్యవస్థల అభివృద్ధికి జాబితాలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రానున్న ఐదు నుంచి పది సంవత్సరాల కాలంలో అవసరమయ్యే  పరికరాలు/వ్యవస్థల అభివృద్ధి, ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది.

మొదటి మూడు జాబితాల్లో ప్రాధాన్యత ఇచ్చిన విధంగా 4వ జాబితాలో పునరావృతమయ్యే మందుగుండు సామగ్రిని దేశంలో ఉత్పత్తి చేసి దిగుమతులు తగ్గించే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. భారత రక్షణ రంగ పరిశ్రమ సామర్థ్యాన్ని గుర్తించి సిద్ధం చేసిన జాబితా వల్ల దేశంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, రక్షణ రంగ పరిశ్రమలో పెట్టుబడులు ఎక్కువ అవుతాయి.   

నాలుగవ జాబితాలో పొందుపరిచిన వస్తువుల వివరాలు  సాయుధ దళాల ప్రస్తుత అవసరాలు  మరియు భవిష్యత్తు అవసరాలను అర్థం చేసుకోవడానికి దేశీయ రక్షణ పరిశ్రమకు అవకాశం కలిగిస్తాయి. అవసరాలకు అనుగుణంగా పరిశోధన, అభివృద్ధి , ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేయాల్సిన చర్యలపై అవగాహన కలిగిస్తాయి.