
డా. వడ్డీ విజయసారధి,
ప్రముఖ రచయిత, సామజిక కార్యకర్త
ఇప్పటికి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైన విషయమేమి టంటే ప్రజలను నిలువునా ముంచుతున్న కేసీఆర్ పాలించే అర్హతను కోల్పోయినాడు. అతడికి, అతని పక్కన నిల్చిన బుడ్డర్ ఖానుగాళ్లకు పాఠం చెప్పే అవకాశం మునుగోడు ఉపఎన్నిక రూపంలో వచ్చింది. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి.
రాజకీయ పరిశీలకుల దృష్టిలో మునుగోడు ప్రాధాన్యం ఏమిటంటే, ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేయవలసిన భాజపా శాసనమండలి ఎన్నికలలో కొన్ని పొరబాట్లు చేసింది. అక్కడ భాజపాపై పైచేయి సాధించిన కేసీఆర్ తనంత రాజకీయ రణతంత్ర సమర్థుడు మరెవ్వరూ లేరని మురిసిపోతూ, పరిపాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తప్పులపై తప్పులు చేసుకొంటూ పోతున్నాడు. భాజపాకు వ్యూహరచనపరంగా తప్పులు దిద్దుకొనే అవకాశమిది.
కాంగ్రెసుకు సంబంధించినంతవరకు వారు నేర్చుకో వలసింది ఎంతవున్నా, నేర్చుకొనేది ఏమీ ఉండదు. తల్లీ కొడుకుల పాదసేవలో తరించి పోతున్న వారికి లక్షమంది పాదాలు పట్టుకొని లక్ష వోట్లు సాధించి గెలవాలనే ఆలోచనే తప్ప, రాజకీయంగా వివరించ వలసిన విషయాలు వివరించే ధైర్యం చేయటం లేదు.
మునుగోడులో ఎనబై మందినో, వంద మందినో శాసన సభ్యులను తెరాస (భారాస అనవలెనేమో!) మోహరిస్తున్నది. వారందరూ కేసీఆర్ పుణ్యాన శాసనసభ్యు లైనవారు. మునుగోడు ప్రజలు లేవనెత్తు ప్రశ్నలకు ఎందరు సమాధానం చెప్పగలరో గమనించి తెలుసుకొందాం.
కాగా భాజపా శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్ పి.డి.యాక్ట్ క్రింద జైలులో ఉంచబడ్డాడు. మరొక శాసనసభ్యుడు ఈటల రాజేందర్ మొహం చూడడానికే భయపడిపోతున్న ముఖ్యమంత్రి గత సమావేశాలలో ఆయనను సభకు హాజరుకాకుండా కుయుక్తులు అమలుచేశాడు. మూడవ సభ్యుడు రఘునందన రావు అనేక విషయాలపై ప్రభుత్వపు దుర్మార్గాలను ఎత్తి చూపుతూ ప్రసంగిస్తూ ఉండగా, మైక్ నిలిపి వేయ బడటం ప్రజల దృష్టికి వచ్చింది. అటువంటి రాజేందర్, రఘునందన రావులు తమ గ్రామాలకు వచ్చి, ఒక్కొక్క విషయాన్ని వివరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకొంటున్నది.
రాజీనామా చేసి భాజపా అభ్యర్థి గా మరల పోటీలో ఉన్న రాజగోపాలరెడ్డిపై ఈ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, తెరాస కార్యాధ్యక్షుడు కేసీఆర్ లు మాట్లాడుతున్నతీరు ఆ ఇద్దరి దివాళాకోరుతనాన్ని బైటపెట్టుతున్నది.
ఈ విధంగా దృశ్యం స్పష్టమవుతున్నది. ఐతే, రోజూ క్రొత్త క్రొత్త కథలను,ఆరోపణలనూ ప్రచారంలోకి తెస్తూ, మాయోపాయాలను ప్రయోగిస్తూ వాతావరణాన్ని కలుషితంచేసే ప్రయత్నాలు జరుగుతాయి. మునుగోడులో జరుగుతున్నది కేవలం ఒక శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక మాత్రమే అనుకొంటే అది పొరబాటవుతుంది.
ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను మాయమాటలతో అధికారాన్ని చేజిక్కించుకుని, దుర్మార్గాలు సాగిస్తున్న వారి నుండి రక్షించడానికి ముందు ముందు జరుగనున్న పోరాటానికి ట్రయిలర్ వంటిదిది. అప్రమత్తంగా ఉంటూ మన వంతు పాత్రను బాధ్యతగా నిర్వహించాలి.
టిఆర్ఎస్ రాజకీయం గుట్టు వెల్లడించిన జగదీశ్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జగదీష్ రెడ్డి, తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్ గారలు అంటున్న మాటలు వింటున్నారా? రాజగోపాలరెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల విలువైన ఒక కాంట్రాక్ట్ ను కట్టబెట్టిందట! అందుకే ఆయన పార్టీ ఫిరాయించి భాజపాలో చేరుతూ, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశాడట! వారు ఇంతవరకే మాట్లాడి ఉంటే ఎవరూ పట్టించుకునే వారు కాదు.
ఆ పైనవారు చెపుతున్నదే గమనార్హంగా ఉంది. రాజగోపాలరెడ్డి గనుక ఆ 18,000 కోట్ల రూపాయలు తెచ్చి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి కోసం ఖర్చు చేసేటట్లయితే తెరాస మునుగోడులో పోటీ చేయకుండా విరమించు కొంటుందట! జాగ్రత్తగా వినండి. ఈ కాంట్రాక్టులో రెండు వేల కోట్ల రూపాయలో, ఐదు వేల కోట్ల రూపాయలో ఆయనకు మిగులుతాయి, అవి తెచ్చి జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయాలనటం లేదు. కాంట్రాక్టు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే మొత్తమంతా, జిల్లా అభివృద్ధి కొరకని వీరి చేతుల్లో పోయాలట!
అప్పడు వీరు సంతుష్టులై తమపార్టీ అభ్యర్థిని ఉపసంహరించి రాజగోపాలరెడ్డి ఎన్నికకు సహకరిస్తా రన్నమాట! కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సొమ్మంతా వీరికే అప్పగిస్తే, కాంట్రాక్టు పని ఎలా అమలు చేయగలడు? ఎమ్మెల్యే గా ఎన్నికై, ఆ తర్వాత జైలులో కూర్చోవాలా? అదేనా వీరి ఆలోచన?
తెరాస ప్రభుత్వం నిధులను ఎలా వ్యయం చేస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఒక క్లూగా మనకు ఉపయోగ పడుతుంది. తెరాస ఒక శాసన సభ్యునిగాని, ఒక గుత్తేదారునిగాని మెచ్చి, కొంత నిధిని విడుదలచేసి అప్పగించారంటే….దానిని యథేచ్ఛగా ఖర్చు పెట్టుకొనడానికి ఇచ్చేసినట్లే. అప్పగించిన పని జరిగిందా లేదా అని అడిగేవారే ఉండరు. నూరు శాతం పొదుపు చేసినా, (బొక్కేసినా) అడిగే వారే ఉండరు. అధిష్ఠానం వారికి అందాల్సిఅంది అంతకు ముందే ముట్టి ఉంటుంది.
ఇప్పుడు చెప్పండి. ఈ రకం రాజకీయాలను మనం సహిస్తూ రాజీపడిపోతూ ఉందామా? లేదు, “రోజులు మారాయి, మీ అకృత్యాలు సాగవు”అని స్పష్టం చేస్తూ వారికి చెంపదెబ్బలాంటి తీర్పు ఇద్దామా?
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి