సీఎం షిండేకు ప్రాణ హాని … ఐబి హెచ్చరిక 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఆదివారం నాడు హెచ్చరించింది. దీంతో ఆయనకు భద్రతను పెంచారు. ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్ డుంబ్రే ఏక్‌నాథ్ షిండేకు ప్రాణ హాని ఉందని సమాచారం వచ్చినట్లు నిర్ధారించారు. 
 
ఈ సమాచారం తమకు అందిన వెంటనే ముఖ్యమంత్రి భద్రతను పెంచామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండటం గమనార్హం. థానేలోని ఇంట్లో ఏక్‌నాథ్ షిండే నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన ముంబైలోని ‘వర్ష’లో కూడా భద్రత పెంచారు. 
 
ముంబైలోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో దసరా ర్యాలీలో అక్టోబర్ 5న షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రసంగించాల్సి ఉంది. దీంతో ఆయన భద్రతపై ఇంటెలిజెన్స్ మరింత దృష్టి సారించింది.  అయితే  ఇటువంటి ప్రమాదాలకు తాను భయపడబోమని, ప్రజలకోసం తనపని తాను చేసుకొంటూ పోతానని షిండే స్పష్టం చేశారు. 
 
ఇటువంటి హెచ్చరికల గురించి తాను పట్టించుకోనని చెబుతూ వాటి సంగతి హోమ్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, హోమ్ మంత్రిత్వ శాఖ చూసుకొంటారని, వారి పట్ల తనకు విశ్వాసం ఉన్నదని తెలిపారు. 
 
శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో, మహారాష్ట్ర బీజేపీ అండతో జూన్‌లో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొలువుదీరిన సంగతి తెలిసిందే.  ఈ పరిణామం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కుప్పకూలి పోవడానికి దారితీసింది.  ఉద్ధవ్ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన సమయంలో కూడా ఏక్‌నాథ్ షిండేకు నక్సల్స్ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ అలజడి రేగిన సందర్భంలో ఏక్‌నాథ్ షిండేకు హాని ఉందని ఇంజెలిజెన్స్ హెచ్చరించడం గమనార్హం.