ఏపీలో ప్రభుత్వ బడుల్లో పడిపోతున్న విద్యార్థులు సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సంఖ్య గత రెండేళ్లలో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం తీసుకుంటున్న ఒంటెద్దు పోకడలే తగ్గుదలకు కారణమని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వంటి కారణాలు వల్లే విద్యార్థులు ప్రభుత్వ బడికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సగానికి సగం మంది తగ్గారు.

2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రస్తుత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి 5.81 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని తేలింది. తాము చేపట్టిన సంస్కరణల వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను మాత్రం బయటపెట్టలేదు.

2020-21 విద్యా సంవత్సరంలో 43,95,214 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2021-22లో ఈ సంఖ్య 44,29,356కు చేరింది. ప్రస్తుత విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య 39,69,653కు పడిపోయింది. మరోపక్క ఎయిడెడ్‌ పాఠశాలల్లో కూడా ఎన్‌రోల్‌మెంట్‌ దారుణంగా పడిపోయింది. 2020-21 విద్యాసంవత్సరానికి, ప్రస్తుత విద్యాసంవత్సరానికి తేడా ఉంది.

2020-21లో ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1,96,408 మంది విద్యార్థులు ఉన్నారు. 2021-22లో 1,64,248 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 1,06,316కు పడిపోయింది. కరోనా వల్ల 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో ప్రైవేట్‌ పాఠశాలలు జరగకపోవడంతో ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపారు.

2019-20 విద్యా సంవత్సరంలో పోల్చుకుంటే 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 5,39,986 మంది, 2021-22లో 5,74,128 మంది విద్యార్థులు అదనంగా చేశారు. ఈ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాఠశాలల విలీనం పేరుతో తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల బాట పట్టారు.

మరోవంక, కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కెజిబివి) పనిచేసే కాంట్రాక్టు టీచర్లకు కనీస వేతన స్కేల్‌ అమలు చేయాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సవరించిన పేస్కేల్‌ను ఆరు వారాల్లోగా బకాయిలతో చెల్లించాలని జస్టిస్‌ కె మన్మథరావు ఉత్తర్వులు జారీ చేశారు.

‘ఒకే తరహా విధులు నిర్వహించేవారికి వేర్వేరు జీతాలు చెల్లింపు చెల్లదు. ఇలా చేయడం దోపిడీ కిందకే వస్తుంది. బానిసత్వమే అవుతుంది. ద్వంద్వ పేస్కేల్స్‌ వివక్ష అవుతుంది. పలువురిని బదిలీ చేసినందున వాళ్లను కదల్చడం సరికాదు. అయితే, బదిలీల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించిన వారికి స్టే ఉత్తర్వులు కొనసాగుతాయి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కనీస వేతన స్కేల్‌ ఇవ్వకుండానే ఉన్నతాధికారులు తమను బదిలీ చేయాలని నిర్ణయించడం అన్యాయమంటూ కెజిబివిల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లు హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. రెగ్యులర్‌ టీచర్లకు, తమకు జీతాల మధ్య చాలా తేడా ఉందని, కనీస పేస్కేల్‌ ఇవ్వకుండా బదిలీ చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషనర్లు వాదించారు.