హాస్యాన్ని పండించడం తేలిక కాదు… అటు ఇటు అయితే కష్టమే

హాస్యం చాలా ఖరీదైనదని చెబుతూ హాస్యాన్ని పండించడం అంత ఈజీ కాదని, కొంచెం అటు ఇటు అయితే చాలా కష్టమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రముఖ హాస్యనటుడు  అల్లు రామలింగయ్య శతజయంతోత్సవం సందర్భంగా ఆయనపై ఓ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ  సినిమాలో హీరో, హీరోయిన్లు ఎంత ముఖ్యమో హాస్యనటులూ అంతే ముఖ్యమని చెప్పారు. 

తన చిన్నతనంలో నాటకాలు చూసేవాన్ని అని చెబుతూ ఇప్పుడవి కనిపించట్లేదు అని గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య సినిమాల్లో తిట్టుకోవడం, కొట్టుకోవడమే ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంటూ  సినిమా అనేది వాస్తవానికి దగ్గరగా ఉండాలని సూచించారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయ్యాలని చెప్పారు. 

ఇవన్నీ అల్లు రామలింగయ్య చేశారని, స్వతంత్ర సమరంలోనూ పాల్గొన్న వ్యక్తి ఆయన అని వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కళామ తల్లికి రెండు నేత్రాలైతే, చిరంజీవి మూడో నేత్రం అని ప్రశంసించారు.

 టెక్నాలజీ ఎంత పెరుగుతున్నాజనాల్లో సినిమాపై ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గట్లేదని తెలిపారు. ఈ ప్రపంచంలో చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెబుతూ  సినిమా జనాల్లో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. సినిమాల్లో విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి, పద్ధతులు ఉండాలని ఆయన సూచించారు. 

ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబసభ్యులు (అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్).. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్య నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరామ్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, పృథ్వీ రాజ్, అలీ, సునీల్, వెన్నెల కిషోర్ లను అల్లు అర్జున్ సన్మానించారు.

అల్లు స్టూడియోస్ ప్రారంభం 

అంతకు ముందు అల్లు రామలింగయ్య కుమారుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్  ను ప్రముఖ నటుడు, రామలింగయ్య అల్లుడు చిరంజీవి ప్రారంభించారు. దాదాపు 10 ఎకరాలలో కోకాపేట లో అత్యాధునిక సాంకేతికతతో దీనిని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రామలింగయ్య గారి బాటలో అరవింద్‌, బన్నీ శిరీష్‌ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారని అభినందించారు. అల్లు ఫ్యామిలీ లో భాగం అవ్వడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ”మా తాతయ్య 100వ పుట్టినరోజు. మాకెంతో ప్రత్యేకం. డబ్బు సంపాదించడం కోసం మేము ఈ స్టూడియోని నిర్మించలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్థం దీన్ని నిర్మించాం. ఇక్కడ సినిమా షూటింగ్స్‌ బాగా జరగాలని, పరిశ్రమకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. 

‘మా నాన్నగారు చనిపోయి 18 ఏళ్లయింది. అనేక మధ్యమాల్లో ఇప్పటికీ ఆయన కన్పిస్తున్నారు. స్టూడియో అనేది ఓ జ్ఞాపిక.. లాభాపేక్ష కోసం కట్టింది కాదు. గీతా ఆర్ట్స్‌ , అల్లు స్టూడియో, ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’ అని అల్లు అరవింద్ ప్రకటించారు.