పీఎఫ్ఐ బంద్ పిలుపుపై కేరళ హైకోర్టు ఆగ్రహం

ఎన్ఐఎ సోదాలు నిరసనగా బంద్ పిలుపు ఇవ్వడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పట్ల కేరళ హైకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా బంద్‌లకు ఎవరూ పిలుపునివ్వకూడదని స్పష్టం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడిన నేపథ్యంలో 12 గంటల బంద్‌కు పీఎఫ్ఐ పిలుపునివ్వడాన్ని తప్పుబట్టింది.
 
 తిరువనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ సభ్యులు వాహనాలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యలు దాడిలో కారు, ఆటో అద్దాలు ధ్వంసమ్యయాయి. కొల్లాంలో సెక్యూరిటీ కోసం వచ్చిన ఇద్దరు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
 
ఆందోళన దృష్ట్యా మరింత ఉద్రిక్తత నెలకొనకుండా భారీగా బలగాలు మోహరించినట్లు డీజీపీ తెలిపారు. అలప్పుజా, కోజికోడ్, వయనాడ్ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులపై దాడులు జరిగాయన్నారు.   మరోవంక వివాదాస్పద ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐని నిషేధించాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ సంస్థకు విద్వేషపూరిత నేరాలు, హత్యలతో సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ, పోలీసులు గురువారం 15 రాష్ట్రాల్లో 102 చోట్ల దాడులు చేసి, దాదాపు 100 మందిని అరెస్ట్ చేశారు.

శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలపాటు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని పీఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఉదయం నుంచి ఆ సంస్థ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, అలజడి సృష్టించడం ప్రారంభించారు. పోలీసులపై కూడా దాడులు చేశారు. బస్సులపైకి రాళ్ళు రువ్వారు.

ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు స్వీయ విచారణ జరిపింది. అనుమతి లేకుండా బంద్‌ చేయాలని ఎవరూ పిలుపునివ్వకూడదని తెలిపింది. బంద్‌కు మద్దతివ్వకూడదని నిర్ణయించుకున్న ప్రజలకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలావుండగా, పీఎఫ్ఐ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, బస్సులపై రాళ్ళు విసిరారు. కొట్టాయం, కొచ్చిలలో కవాతు చేశారు. 

ఎన్ఐఏ గురువారం నిర్వహించిన దాడుల్లో అరెస్ట్ చేసిన పీఎఫ్ఐ ఢిల్లీ యూనిట్ చీఫ్ పర్వేజ్ అహ్మద్‌ సౌదీ అరేబియాలో 14 ఏళ్లపాటు ఉన్నారని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఆ సమయంలో ఆయన నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మువ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలిపాయి.

వయనాద్ జిల్లాలోని పనమరం గ్రామంలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుపై పీఎఫ్ఐ కార్యకర్తలు రాళ్ళు రువ్వినట్లు పోలీసులు తెలిపారు. ఇతర చోట్ల కూడా రాళ్లు రువ్విన సంఘటనలు జరిగాయని చెప్పారు. కొజిక్కోడ్‌లోని ఎస్ఎం వీథిలో బంద్ ప్రభావం సంపూర్ణంగా కనిపించింది. దుకాణాలను పూర్తిగా మూసేశారు.

రాజధాని నగరం తిరువనంతపురంలోని పూంతురలో పీఎఫ్ఐ కార్యకర్తల దాడిలో ఓ ఆటో, ఓ కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. కొజిక్కోడ్, కొచ్చి, అలపుజ, కొల్లంలలో కేఎస్ఆర్టీసీ బస్సులపై దాడులు జరిగాయని చెప్పారు. కొల్లం జిల్లాలోని పల్లిముక్కు వద్ద  బైక్‌పై వచ్చిన పీఎఫ్ఐ కార్యకర్తలు ఇద్దరు పోలీసులపై దాడి చేసినట్లు తెలిపారు.

 కొజిక్కోడ్, కన్నూరులలో జరిగిన రాళ్ళ దాడిలో 15 ఏళ్ళ బాలిక, ఆటో రిక్షా డ్రైవర్ గాయపడ్డారని చెప్పారు. అళపుజలో కేఎస్ఆర్టీసీ బస్సులు, ఓ ట్యాంకర్ లారీ, కొన్ని ఇతర వాహనాలు రాళ్ళ దాడుల్లో దెబ్బతిన్నట్లు తెలిపారు. తిరువనంతపురం, కొల్లం, కొజిక్కోడ్, వయనాద్‌లలో కూడా బస్సులపై రాళ్ళదాడులు జరిగాయన్నారు.

కేరళ బంద్‌ నేపథ్యంలో తమిళనాడులో పీఎఫ్ఐ ప్రాబల్యంగల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నై, దిండిగల్, కోయంబత్తూరు, రామనాథపురం, తిరునల్వేలి, మధురై, సేలం, ఈరోడ్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.  కర్ణాటకలోని హుబ్లీలో కూడా 50 మంది రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.  రోడ్డుపై వాహనాలను అడ్డుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. దీంతో ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు