డీఎంకే ఎంపీ రాజాపై లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఫిర్యాదు

హిందువులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే పార్లమెంటు సభ్యుడు ఎ.రాజాపై లోక్‌సభ స్పీకర్ ‌ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్టు తమిళనాడు బీజేపీ ఐటీ, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు. ఎంపీ అనైతిక ప్రవర్తనపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను  ఆయన కోరారు. భవిష్యత్తులో రాజాను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
 
లోక్‌సభలో కాండ్టక్ట్ అఫ్ బిజినెస్ 233ఎ(4) నిబంధన కింద ఎంపీపై తాను ఈ ఫిర్యాదు చేసినట్టు కుమార్ మంగళవారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు. స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని కూడా ఆయన తన ట్వీట్‌కు జోడించారు.  హిందువులకు వ్యతిరేకంగా రాజా చేసిన వ్యాఖ్యలకు నరసనగా బీజేపీ, పలు హిందూ సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గమైన నీలగిరిలోని దుకాణాలు, హోటళ్లు, బేకరీల వంటి వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
 
ఉదగమండలం, కూనరు, కొత్తగిరి, గుడలూరులో బంద్ పాటించారు. కాగా, కొన్ని దుకాణాలు మాత్రమే మూతపడ్డాయని, దుకాణం షట్టర్లు మూసివేయాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశామని ఎస్‌పీ ఆశిష్ రావత్ తెలిపారు.  కోయంబత్తూరు జిల్లా అన్నూరులో 17 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. దుకాణాలు మూసివేయవద్దని పోలీసులతో పాటు డీఎంకే, సీపీఎం కార్యకర్తలు ఆయన దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు.

డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ.రాజా ఇటీవల చెన్నైలో జరిగిన పార్టీ భేటీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ”హిందువుగా ఉన్నంత వరకూ నవ్వు దళితునివే. అంటరానివాడివే. శూద్రుడివే. శూద్రునిగా ఉన్నంతకాలం నవ్వు ఓ వేశ్య సంతానమే” అని ఆయన పేర్కొన్నారు. మీలో ఎంతమంది వేశ్య సంతానంగా, అంటరానివారిగా మిగిలి పోవాలనకుంటున్నారంటూ నిలదీశారు. ఈ ప్రశ్నలపై గొంతెత్తినప్పుడే సనాతన ధర్మాన్ని బద్దలుకొట్టే ఆయుధంగా మారగలమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో దుమారం రేగింది.