
ఎన్నికల ప్రచారం కోసం జరిపిన గుజరాత్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో పోలీసు సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారని[పేర్కొంటూ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దేశ వ్యాప్తంగా గల సుమారు 30 మంది మాజీ ఐపీఎస్ అధికారులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జోక్యం చేసుకొని, ఆయనపై తగు చర్య తీసుకోవాలని వారు కోరారు.
గుజరాత్ పోలీసులపై కేజ్రీవాల్ ప్రవర్తించిన తీరును మహారాష్ట్ర మాజీ డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ ఆ లేఖలో వివరించారు. గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ప్రచారానికి వస్తున్నారని, విజయం కోసం ఆయా పార్టీలు ప్రచారం చేసుకోవడం కూడా సహజమేనని పేర్కొన్నారు.
గుజరాత్ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్ తమ పార్టీ ప్రచారం కోసం ఇటీవల అహ్మదాబాద్‌కు వచ్చారని చెప్పారు. ఒక రిక్షా కార్మికుని ఇంటికి వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఆయన వెళ్లాలనుకున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూసేందుకు, ఆయన భద్రత కోసం ఆయన వెంటే వచ్చేందుకు పోలీసు అధికారులు సిద్ధపడగా కేజ్రీవాల్ వారి సూచనలు పెడచెవిని పెట్టారని తెలిపారు.
దీనికితోడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రవీణ్ దీక్షిత్ ఆ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వ్యాఖ్యలు కేవలం గుజరాత్ పోలీసులను మాత్రమే కాకుండా యావద్దేశ పోలీసులను తక్కువ చేసి మాట్లాడినట్టుగా భావించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పోలీసు వ్యవస్థను బలహీనపరచే వ్యాఖ్యలు మునుముందు చేయకుండా కేజ్రీవాల్‌ను నిలువరించేందుకు తగిన జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రవీణ్ దీక్షిత్ ఆ లేఖలో కోరారు.
ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఉత్తరప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్, కేరళ మాజీ డైరెక్టర్ జనరల్ ఎం.జి. రామన్, బీహార్ మాజీ డైరెక్టర్ జనరల్ ఎస్.కె. భరద్వాజ్, ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ అలోక్ శ్రీవాస్తవ తదితరులు ఉన్నారు.
More Stories
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
జస్టిస్ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ
నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా