యుద్ధం ఆపమన్న మోదీ …. ఆ ప్రయత్నమే అన్న పుతిన్

ప్రస్తుతం యుద్ధం చేసే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ఆపివేయాలని కోరారు. 
 
యుద్ధ సమయంలో భారత విద్యార్ధులను సురక్షితంగా తరలించేందుకు సహకరించినందుకు మోదీ పుతిన్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇద్దరు నేతలూ ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
 ‘ఇవాళ ప్రపంచం ముందు.. ముఖ్యంగా వర్ధమాన దేశాల ఆందోళనంతా ఆహార, ఇంధన భద్రత, ఎరువుల గురించే. ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుగొనాలి. దీనిని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఇది యుద్ధాల కాలం కాదు. దీనిపై ఫోన్లో మనం పలుసార్లు మాట్లాడుకున్నాం’ అని మోదీ గుర్తుచేశారు. దీనికి పుతిన్‌ సానుకూలంగా స్పందించడం విశేషం.
 
యుద్ధం ఆపాలన్న మోదీ సూచనపై స్పందించిన పుతిన్ తాము కూడా సాధ్యమైనంత త్వరగా యుద్ధం ఆపాలనుకుంటున్నామని, సంక్షోభానికి వీలైనంత త్వరగా తెరదించాలనుకుంటున్నామని చెప్పారు. సంక్షోభ వేళ భారత్ ప్రతిస్పందనను తాము అర్థం చేసుకోగలమని పుతిన్ తెలిపారు. 
‘ఉక్రెయిన్‌పై మీకు గల ఆందోళనలు మాకు అర్థమవుతున్నాయి. అయితే సాధ్యమైనంత త్వరగా దీన్ని ముగించాలని కూడా భావిస్తున్నాం’ అని పుతిన్‌ చెప్పారు. ప్రాంతీయ, ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చర్చల ప్రక్రియలో పాల్గొనేందుకు ఉక్రెయిన్‌ నిరాకరిస్తోందని, యుద్ధరంగంలో సైనికంగానే తన లక్ష్యాలను సాధించాలనుకుంటోందని తెలిపారు.
చర్చలు అద్భుతంగా జరిగాయని భేటీ తర్వాత మోదీ ట్వీట్‌ చేశారు. రెండు దేశాల సంబంధాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. కీలక అంశాలపై అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం వృద్ధి చెందుతోందని.. ముఖ్యంగా రష్యా నుంచి భారత్‌కు ఎరువుల సరఫరా ఎనిమిది రెట్లు పెరిగిందని గుర్తుచేశారు.
శనివారం ప్రధాని జన్మదినం కావడంతో పుతిన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మై డియర్‌ ఫ్రెండ్‌.. రష్యా సంప్రదాయం ప్రకారం ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పం. అందుచేత ఇప్పుడు చెప్పలేను. మీ నాయకత్వంలో భారత్‌ పురోగమించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
కాగా, ఇండియా-రష్యా మధ్య వీసాల్లేకుండా ప్రయాణాలకు అనుమతించేలా ఇరుదేశాలు పరస్పరం నిబంధనలను రూపొందించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధాని మోదీతో ప్రస్తావించారు. రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. 
మోదీ, జిన్‌పింగ్‌ ఎడమొహం.. పెడమొహం
గల్వాన్‌ లోయలో సైనికుల వివాదం తర్వాత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తొలిసారి ఎస్‌సీవో సదస్సుకు హాజరయ్యారు. ద్వైపాక్షిక భేటీ లేదు సరికదా జిన్‌పింగ్‌కు వీలైనంత దూరంగా ఉండేందుకు మోదీ ప్రయత్నించారు. ఫొటో సెషన్‌లో కూడా పక్కపక్కనే నిలబడినా కరచాలనం చేసుకోలేదు. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వూ లేదు.
మరోవైపు ప్రధాని మోదీ, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌తో సమావేశమయ్యారు. ఎస్‌సీవో అధ్యక్ష పీఠాన్ని సభ్య దేశాలు రొటేషన్‌ ప్రాతిపదికన చేపడుతుంటాయి. ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉన్న ఉజ్బెక్‌  ఆ బాధ్యతను భారత్‌కు అప్పగించింది. 
 
పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌తోనూ మోదీ మాట్లాడలేదు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తుండటంతో ఆయన షరీఫ్‌తో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అంతర్జాతీయ వేదికలపై చైనా, పాకిస్థాన్‌లకు ఏకకాలంలో షాకివ్వడం ద్వారా భారత దృఢ వైఖరిని తెలియజేసినట్లైందని పరిశీలకులు చెబుతున్నారు.