ఆర్ఎస్ఎస్ సమన్వయ్ బైఠక్‌లో సామాజిక సవాళ్లపై మేధోమథనం

ఆర్ఎస్ఎస్ సమన్వయ్ బైఠక్‌లో సామాజిక సవాళ్లపై మేధోమథనం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధానిలో శనివారం నుండి మూడు రోజులపాటు జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్ఫూర్తితో వివిధ సామాజిక రంగాలలో పనిచేస్తున్న సంస్థల అఖిల భారతీయ సమన్వయ్  బైఠక్ (సమన్వయ సమావేశం)లో పలు సామజిక సవాళ్లపై మేధోమధనం జరుగనున్నట్లు సంస్థ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగే ఏడాదికి ఒక సారి జరిగే ఈ సమావేశానికి సమాజానికి సేవ చేసేందుకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలేలతో పాటు ఐదుగురు సహ సర్ కార్యవాహలు  డాక్టర్ కృష్ణ గోపాల్, డాక్టర్ మన్మోహన్ వైద్య, అరుణ్ కుమార్, ముకుంద, రామదత్ చక్రధర్ లతో పాటు సంస్థలోని ఇతర కార్యనిర్వాహకులు కూడా పాల్గొంటున్నారు.

మొత్తం 36 సంస్థలు ఈ సమావేశానికి హాజరవుంటున్నారు. విద్యా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సక్షం, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, సేవాభారతి, విశ్వహిందూ పరిషత్, రాష్ట్ర సేవికా సమితి, భారతీయ జనతా పార్టీ, అఖిల భారతీయ మజ్దూర్ సంఘ్, అఖిల భారతీయ కిసాన్ సంఘ్ లతో సహా వివిధ సామాజిక రంగాలలో చురుకుగా పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఆయా సంస్థలు సామజిక, జాతీయత అంశాలపై పనిచేస్తున్నాయని చెబుతూ అటువంటి సంస్థలలో చురుకుగా ఉన్న స్వయంసేవకులతో ఆర్ఎస్ఎస్   సమన్వయం   చేసుకుంటుందని సునీల్ అంబేకర్ వివరించారు.

“ఈ సమావేశంలో సంబంధిత సంస్థ కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకోవడంతో పాటు పర్యావరణం, కుటుంబ అవగాహన, సామాజిక సామరస్యం వంటి అంశాలపై సమన్వయ ప్రయత్నాలపై చర్చ జరుగుతుంది” అని ఆయన చెప్పారు. గౌ-సేవ, పర్యావరణం, విద్య, సైద్ధాంతిక రంగం, ఆర్థిక ప్రపంచం, సేవా కార్యక్రమాలు, వివిధ సామాజిక మరియు జాతీయ భద్రతా సమస్యలకు సంబంధించిన అంశాలు కూడా సమావేశంలో మేధోమథనానికి వస్తాయని ఆయన వివరించారు.