త్రిపుర సమస్యలపై ప్రధాని మోదీతో భేటీ కానున్న ప్రధాని షేక్‌ హసీనా

ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టు (ఐసిపి) ఏర్పాటుతో పాటు త్రిపురకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా వచ్చే వారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి అభిషేక్‌ చంద్ర తెలిపారు. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన హసీనా సెప్టెంబర్‌ 5 నుండి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.

సెప్టెంబర్‌ 6న మోదీతో హసీనా సమావేశమయ్యే అవకాశాలున్నాయని అభిషేక్‌ తెలిపారు. ‘బంగ్లాదేశ్‌ నుండి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో దక్షిణ త్రిపురలోని ముహురి ఘాట్‌లో ఐసిపిని నిర్మించలేదు. అదేవిధంగా ఆమె పర్యటన నేపథ్యంలో మోదీ కూడా సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నారు’ అని విలేకరుల సమావేశంలో చెప్పారు.

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌తో ఓడరేవు అనుసంధానానికి మద్దతుగా ఫెని నదిపై మైత్రి సేతు (వంతెన) గత ఏడాది మార్చి 9న మోదీ  ప్రారంభించారని అభిషేక్‌ తెలిపారు. అయితే ఆ దేశంలో నదికి అవతలి వైపున ల్యాండ్‌ కస్టమ్స్‌ స్టేషన్‌ను ఇంకా ఏర్పాటు చేయనందున వాణిజ్య కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

ఇద్దరు ప్రధానుల భేటీలో ఈ అంశం కూడా చర్చకు రావచ్చునని, దీంతో మైత్రి సేతు వినియోగంలోకి వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా దక్షిణ త్రిపురలోని శ్రీనగర్‌, సెపాహిజాలా జిల్లాలోని కమలాసాగర్‌ అనే రెండు సరిహద్దు హాత్‌లు మూతబడ్డాయని చెప్పారు. అయితే దీనిపై కూడా చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌, మోంగ్లా ఓడరేవుల ద్వారా త్రిపురకు సెపాహిజాలా జిల్లాలోని సోనామురా సబ్‌ డివిజన్‌లోని శ్రీమంతపూర్‌ ఐసిపి ద్వారా ట్రయల్‌రన్‌ గత నెల ప్రారంభం కాగా, ఈ మార్గం ద్వారా మరింత సాధారణ వస్తువుల రవాణా చేయనున్నట్లు తెలిపారు.