సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ రాళ్లతో దాడి…. తీవ్ర ఉద్రిక్తత

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దేవరుప్పలకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆజాదీ కా అమ్రుత మహోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడికి యత్నించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తల రక్తం చిందింది. ఇద్దరు బీజేపీ కార్యకర్తల తలలు పగిలాయి. పలువురికి గాయాలయ్యాయి.
 ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ మూకలు యత్నిస్తున్నాయనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. పోలీసుల ముందే టీఆర్ఎస్ మూకలు కర్రలు, రాడ్లు పట్టుకుని అడ్డుకునేందుకు యత్నించాయి. పాదయాత్రపైకి రాళ్లు విసిరారు. దీంతో దాడికి అడ్డుకునేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
 టీఆర్ఎస్ గూండాల అరాచకాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ తీరుపై మండిపడ్డారు. నేరుగా డిజిపికి ఫోన్ చేసి బీజేపీ కార్యకర్తల తలల పగల కొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడండి, లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ ఘటన నేపథ్యంలో తనకు నియమించిన భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. తన భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారని స్పష్టం చేశారు. కాగా,  మేడ్చల్ జిల్లా నుండి వచ్చిన మహిళా కార్యకర్తల వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు, వారిపై దాడిచేసే ప్రయత్నం చేశారు. దానితో టీఆర్ఎస్ మూకల తీరుపై బీజేపీ మహిళా కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పాదయాత్రలో భాగంగా  సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించగా,  దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని టీఆర్ఎస్ నాయకుడు సంజయ్ ని నిలదీశారు .
ఈ క్రమంలోనే బీజేపీ నాయకులపైకి టీఆర్ఎస్ నాయకులు రాళ్ళ దాడి చేశారు. వాగ్వాదానికి దిగిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలోనే సీపీ ఏం చేస్తున్నాడంటూ  సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  దమ్ముంటే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.   ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటకు దారి తీసింది. ఈ లోగా రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.
కేసీఆర్ నిరంకుశ పాలనను బొందపెట్టడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్రను  ప్రజాస్వామ్య బద్దంగా యాత్ర చేస్తున్నామని సంజయ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే యాత్ర చేస్తుంటే టీఆర్ఎస్ నేతలకు వచ్చిన నొప్పేంటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటే తమకెందుకీ బాధ అంటూ ఎద్దేవా చేశారు.
“తెలంగాణ ద్రోహులను సంకలో పెట్టుకోవడమేనా తెలంగాణ ఉద్యమం? మనపై రాళ్లు వేసినా… ఇంకా ఏం వేసినా…భయపడే ప్రసక్తే లేదు” అని సంజయ్ తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ గుండాలు తమను అడ్డుకుంటారని తెలిసినా ఇక్కడి సీపీ ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని, మరో ఆరు నెలలే అని పోలీస్  అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 
ఎవరెంత రెచ్చగొట్టినా బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, వాళ్లు రాళ్లు వేసినా మనం పూలుగానే భావిద్దామని సంజయ్ పార్టీ కార్యకర్తలకు హితవు చెప్పారు. “ప్రశాంతంగా పాదయాత్రను కొనసాగిద్దాం.. ప్రజలను కలుసుకుని వారి బాధలు విందాం. కేసీఆర్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు భరోసా ఇద్దాం..” అని తెలిపారు. 
సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 13వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో వాగ్వాదానికి ముందు దేవరుప్పల బీజేపీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు.  దేవరుప్పలలోని ఓ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ మోదీ ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో ఇప్పుడు జాతీయ పతాకం గొప్పతనం  ప్రపంచ దేశాలకు తెలిసిందని, అందరి ఇళ్లపైనా జాతీయ జెండాను చూస్తున్నామని చెప్పారు