విభజన దశలో బలి అయిన వారికి ప్రధాని నివాళి

దేశ విభజన దశలో పలు కష్టాలు అనుభవించి, ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నివాళులు అర్పించారు. దేశ విభజన భయానక ఘట్టాల సంస్మరణ దినం ఆగస్టు 14న నిర్వహించుకుంటున్న దశలో మోదీ తమ స్పందన వెలువరించారు. 
 
దేశ చరిత్రలో అది ఒక అత్యంత విషాదకర ఘట్టం అని, ఈ రోజులలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారిని, త్యాగాలు చేయాల్సి వచ్చిన వారిని, ఏకంగా ప్రాణాలు కోల్పోయిన వారిని, ఆప్తులను దూరం చేసుకుని బతకాల్సి వచ్చిన వారిని అంతా స్మరించుకుందామని ప్రధాని తెలిపారు. 
 
1947లో దేశ విభజన దశలో పాకిస్థాన్ ప్రత్యేకంగా ఏర్పాటు అయినప్పుడు లక్షలాది మంది నిర్వాసితులు కావడం, మతపర ప్రాతిపదికన దూర ప్రాంతాలకు వేలాది మంది అతి కష్టమైన ప్రయాణాల నడుమ సాగిపోవడం. మతకల్లోలాలు సంభవించి పలువురు చనిపోవడం, రక్తపాతాలకు దారితీయడం వంటి ఘటనల బాధాకర మననం విషాదకరమే అప్పటి బాధితులకు తన నివాళి అని ప్రధాని తెలిపారు.
కేంద్ర మంత్రుల మౌన ప్రదర్శన
 కాగా,విభజన విషాద సంస్మరణ దినం సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఢిల్లీలో ఆదివారం మౌన ప్రదర్శన నిర్వహించింది. కేంద్ర మంత్రులు జి.కిషన్‌ రెడ్డి, అశ్విని వైష్ణవ్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, మీనాక్షి లేఖితోపాటు పెద్ద సంఖ్యలో యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. 
 
దేశ విభజన భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. అనంతరం, విభజన కాలం నాటి దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా ఐజీఎన్‌సీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. 
 
కాగా, దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించేందుకు బీజేపీ కూడా మౌన ప్రదర్శన నిర్వహించింది. ‘‘విభాజన్‌ విభీషికా స్మృతి దివస్‌’’ పేరిట జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అనురాగ్‌ ఠాకూర్‌, తదితరులు పాల్గొన్నారు.