ప్రతి పౌరుడి నిత్య జీవనం ఆత్మనిర్భర్ కావాలి 

ఆత్మ నిర్భర్ భారత్ అన్నది ఒక నినాదం కాదని, ఆత్మనిర్భర్ భారత్ ప్రభుత్వ విధానం కాదని, ఆత్మనిర్భర్ భారత్ అన్నది ప్రజాఉద్యమంగా సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు.  76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ  ఆత్మనిర్భర్ భారత్ ప్రతి పౌరుడి నిత్య జీవనం కావాలని అభిలాషను వ్యక్తం చేశారు. 
 
ఆత్మనిర్భర్ భారతంలో తొలిమెట్టు సైనిక సంపత్తి స్వదేశీకరణ అని చెబుతూ  దేశంలో 300 పరికరాల తయారీకి సైన్యం సంకల్పించిందని తెలిపారు. సైన్యం సంకల్పం మేరకు మనం నిరూపించుకోవాలని, సైన్యంతో పాటు యావత్ భారతం కలిసి నడవాలని మోదీ  సూచించారు. 
 
మనం ఊహించనంత అతిపెద్ద మార్కెట్ ఆటవస్తువులు అని, పిల్లలాడే ప్రతి ఆట వస్తువు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వందే భారత్ రైళ్లు, మెట్రో, సౌరవిద్యుత్ ఫలకాలు, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగం కావాలని చెప్పారు. 
 
ప్రకృతితో ముడిపడిన అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలని చెబుతూ  అమృతకాలంలో పంచప్రాణాల సంకల్పం ప్రధాని ప్రతిపాదించారు. పంచప్రాణాలు అనగా వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు. 
 
వ్యవసాయంలో రసాయనిక ఎరువుల నుంచి విముక్తి కలగాలని మోదీ  పిలుపునిచ్చారు. నానో రసాయనిక ఎరువుల దిశగా భారత్ ముందడుగు వేయాలని అభిలాషను వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారతంలో ప్రైవేటు రంగం కీలక భూమిక పోషిస్తుందని చెబుతూ ప్రపంచ ఆకాంక్షల సాకారంలో భారత్ ప్రధాన భూమిక పోషించాలని ప్రధాని  ఆకాంక్షించారు. 
 
భారత మూలాలున్న విద్యావిధానానికి ప్రాణం పోయాలని, యువశక్తిలో దాగిన సామర్థ్యాలను వెలికితీయాలని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్‌ ఇండియా ఇప్పుడొక కొత్త విప్లవమని, ఎంతో మంది యువత స్టార్టప్‌లతో ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ అభివృద్ధిలో భాగమేనని, ప్రకృతితో ముడిపడిన  
 
అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన భారత్‌ను నిలబెడదామని పిలుపిచ్చారు. స్వచ్ఛ భారత్‌, ఇంటింటికీ విద్యుత్‌ సాధన అంత తేలిక కాదని, లక్ష్యాలను వేగంగా చేరుకునేలా భారత్‌ ముందడుగు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దశాబ్దం ఖచ్చితంగా టెక్నాలజీదేనని స్పష్టం చేస్తూ దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. జైజవాన్‌, జైకిసాన్‌, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్‌ అని నినందించారు. 
 
చట్టబద్ధ జీవనం, వ్యక్తిగత బాధ్యత ప్రతి పౌరుడిలో కనిపించాలని పేర్కొంటూ ఇంటింటికీ విద్యుత్, ప్రతి చేనుకు నీరు అనేది ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యుత్, నీరు పొదుపు అన్నది ప్రజలందరి బాధ్యత అని, నవ సంకల్పంతో బాధ్యాయుతమైన భారత్‌ను నిర్మిద్దామని, అరవిందుడు చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకోవాలని సూచించారు. 
 
భారత్‌ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని చెబుతూ 75 ఏళ్లగా ఎన్నో ఒడిదుడుకులను చూసిందని పేర్కొన్నారు. ఇన్నేళ్లలో దుఖాలతో పాటు విజయాలు కూడా ఉన్నాయని, ప్రకృతి వైపరిత్యాలు, యుద్ధాలు, ఇతర సమస్యలను ఎదుర్కొన్నామని, అయితే భిన్నత్వంలో ఏకత్వం మన మార్గదర్శక శక్తిగా మారిందని వివరించారు.
త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమని అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అసమానమని కొనియాడారు.  జవహర్‌లాల్‌ నెహ్రు, నేతాజీ, సావర్కర్‌ దేశ నిర్మాతలని పేర్కొన్నారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, అల్లూరి, గోవింద్‌గురు వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శమని పేర్కొన్నారు.
 
 అంతకుముందు రాజ్‌ఘాట్‌ చేరుకున్న ప్రధాని మోదీ  జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న మోదీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.