నాన్సీ కుటుంబంపై, అమెరికాతో సైనిక చర్చలపై చైనా నిషేధం!

హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన అగ్గిమీద గుగ్గిలం అవుతున్న చైనా ఒక వంక టైవాన్ ను సైనిక దిగ్బంధనం చేయడంతో పాటు,  మరో వంక అమెరికాపై ఆంక్షలకు ఉపక్రమించింది. తాజాగా స్పీకర్‌ నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది.

‘చైనా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా పెలోసీ తైవాన్‌లో పర్యటించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకోవటం తీవ్రమైన అంశం. చైనా సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, ఒకే చైనా పాలసీని అణచివేయటమే. అలాగే.. తైవాన్‌లో శాంతి, సామరస్యాన్ని ఆందోళనలో పడేశారు. దాంతో పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై బీజింగ్‌ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. 

మరోవంక, ఇరు దేశాల మధ్య జరగాల్సిన అత్యున్నత స్థాయి సైనిక కమాండర్ల చర్చలు, వాతావరణ మార్పులపై చర్చలను నిలిపివేసింది. అలాగే, పలు రంగాల్లో సహకారాన్ని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. సరిహద్దు నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం, అక్రమ వలసదారులను స్వదేశానికి రప్పించడం వంటి ఎనిమిది నిర్దిష్ట చర్యల విషయంలో అమెరికాతో సహకారాన్ని నిలిపివేస్తున్నట్టు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. 

ఆసియా పర్యటనలో భాగంగా పెలోసీ జపాన్‌  బయలుదేరిన కాసేపటికే చైనా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అలాగే, సముద్ర సైనిక భద్రతా యంత్రాంగంపై ప్రణాళికబద్ధమైన సమావేశాన్ని కూడా చైనా రద్దు చేసింది. మరోవైపు, పెలోసీపై చైనా ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. ఆమె ‘దుర్మార్గపు’, ‘రెచ్చగొట్టే’ చర్యలను నిరసిస్తూ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ప్రత్యేకంగా ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే, అవి ఎలాంటి ఆక్షలన్న విషయంలో స్పష్టత లేదు.

చైనాలోని షింజియాంగ్‌, హాంగ్‌కాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, డ్రాగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇటీవల పలువురు అమెరికా అధికారులపై ఆంక్షలు విధించింది. 

అమెరికా అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈఏడాది మార్చిలో ప్రకటించింది చైనా. ఈ జాబితాలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవరోవ్‌లు ఉన్నారు. చైనాలోకి ప్రవేశించకుండా, చైనాతో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఈ ఆంక్షలు ఉన్నాయి.

కెనడా దౌత్యవేత్తకు  చైనా సమన్లు 

కాగా, కెనడా దౌత్యవేత్త జిమ్‌ నికెల్‌కి శుక్రవారం చైనా సమన్లు జారీ చేసింది. గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ (జి7 ) దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటనలో కెనడా పాల్గనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ జలసంధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతలను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాలంటూ జి7 దేశాలు బుధవారం చైనాకు సూచించాయి. 

ఈ ప్రకటనల్లో కెనడా విదేశాంగ మంత్రి జిమ్‌ నికెల్‌ పేరు కూడా ఉండటంతో చైనా విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులిచ్చారు. తైవాన్‌ విషయంలో కెనడా తక్షణమే తన తప్పును సరిదిద్దు కోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొంది.