వనరులు ఉన్నా వినియోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వం అంటూ జగన్ సర్కారు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ కు కావలసిన కేటాయింపులు కేంద్రం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా ఆయుష్ విభాగం అభివృద్ధిలో ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదని ధ్వజమెత్తారు.
ఆసుపత్రులకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫలమైందని ఆయన ఆరోపించారు. గన్నవరంలో 100 పడకలతో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర సర్కారు భూమి కేటాయించలేక పోయిందని పేర్కొన్నారు.
ఫలితంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన సేవలందించే కేంద్ర ప్రభుత్వ సంస్థను ప్రజలకు అందకుండా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 100 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదనలు పంపిస్తే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారి ఆసుపత్రి నిర్మాణం నిలిచిపోయిందని వీర్రాజు తెలిపారు.
ఇక, విశాఖపట్నంలో ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నప్పటికీ సరైన అవగాహన లేని కుటుంబ పార్టీల పాలన వైఫల్యం కారణంగా అది కూడా రాష్ట్రానికి దక్కకుండా పోయిందని సోము ఆవేదన వ్యక్తం చేశారు.
గత మూడేళ్లలో ఆయుష్ విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా రూ 29 కోట్ల కేంద్ర సహాయం అందించినప్పటికీ ఆ తరహా సేవలను రాష్ట్ర ప్రజలకు అందించడంలో ఏ మేరకు సహకరించిందో ప్రభుత్వ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన