అమెరికాలో మంకీ పాక్స్ హెల్త్ ఎమర్జెన్సీ

మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికా శుక్రవారం  ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా (హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. మంకీ పాక్స్ నివారణకు అధిక నిధులు కేటాయించడంతో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా 25,800 మంకీ పాక్స్ కేసులు నమోదైన దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ జులై నెలలోనే మంకీ పాక్స్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
 
మంకీ పాక్స్ సోకిన రోగులకు జ్వరం, చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుండటం తో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు.  అమెరికా దేశంలో ఇప్పటికే 6,600 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ నగరంలో మంకీ పాక్స్ కేసులు అధికంగా నమోదవడంపై యూఎస్ వైద్యాధికారులు ఆ నగరంపై దృష్టి సారించారు.
ఆఫ్రికా దేశంలో మంకీ పాక్స్ వైరస్ గతంలో కంటే భిన్నంగా  ప్రధానంగా లైంగిక కార్యకలాపాల ద్వారా వ్యాపిస్తుంది.పురుషులు పలువురు పురుషులతో సంబంధాలు పెట్టుకుంటే మంకీ పాక్స్ వచ్చే ప్రమాదముందని గుర్తించిన అమెరికా వైద్యాధికారులు హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారు. మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలని, ప్రజలు వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. మంకీ పాక్స్ సోకే అవకాశమున్న రిస్క్ గ్రూపు వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు.
భారత్ లో 9కి చేరిన  మంకీ పాక్స్ కేసులు
 
మరోవంక, దేశ రాజధాని ఢిల్లీలో ఒక విదేశీ మహిళ (31)కు మంకీ ఫాక్స్‌ పాజిటివ్‌ నిర్ధారణమైంది. దీంతో ఢిల్లీలో ఈ కేసుల సంఖ్య నాలుగుకు, దేశంలో 9కి చేరాయి. ఈ కేసులన్నీ కేరళ, ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఢిల్లీలో తాజాగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విదేశీ మహిళ ప్రయాణ వివరాలు ఇంకా తెలియరాలేదు. 
 
ఆమెకు జ్వరం, చర్మ సంబంధిత రుగ్మతలు ఉండటంతో స్థానిక లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ ఆసుపత్రిలోని ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. గత బుధవారం నాడు పాజిటివ్‌ నిర్ధారణ అయిన 35 ఏళ్ల విదేశీయునికి కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. 
 
మంకీ ఫాక్స్‌ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రయివేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. కాగా ఢిల్లీలో తొలి మంకీ ఫాక్స్‌ బాధిత వ్యక్తి కొలుకొని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. 
 
కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంకీఫాక్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను మరోమారు సమీక్షించింది. ఈ వ్యాధి నిర్ధారణ అయినవారిని, అనుమానిత లక్షణాలను ఉన్నవారిని ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించాలని సూచించింది. అలాగే యాంటీ కోవిడ్‌ నియమావళిని తుచ తప్పకుండా పాటించాలని పేర్కొంది.