ఏపీ మైనింగ్ అక్రమాలపై విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్‌ అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు కేంద్ర అణు ఇంధన వ్యవహారాలు, ప్రధాని కార్యాలయశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాలని అణు ఇంధన శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యం, మైనింగ్‌ చట్టాల ఉల్లంఘన, మోనజైట్‌ అక్రమ ఎగుమతులపై కేంద్ర గనుల శాఖ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 
 
మోనజైట్‌ అక్రమ ఎగుమతులపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎపిలో అణు ఇంధనానికి సంబంధించిన ఖనిజాలు అక్రమ ఎగుమతులు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయని కేంద్ర గనుల శాఖ ఫిర్యాదు చేసిందని చెప్పారు. మోనజైట్‌ అక్రమ ఎగుమతులపై అణు ఇంధన శాఖ సీరియస్‌గా తీసుకుని, దర్యాప్తు చేయాలని ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. 
 
ఎంత మేరకు మినరల్స్‌ వెలికి తీసి, రవాణా చేశారు? అమ్మకం జరిపారు? చేసిన ఉల్లంఘనలపై విచారణ జరపాలని ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ను కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ జరిపే లీజు హక్కులు ఇవ్వాలని ఎపి ప్రభుత్వం కోరిందని మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.  బుధవారం లోక్‌సభలో వైసిపి ఎంపి కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ కోసం 17 ప్రదేశాల్లో ఎపిఎండిసికి అనుమతివ్వాలని ఎపి ప్రభుత్వం కోరగా, రెండు చోట్ల మాత్రమే అనుమతిచ్చినట్లు పేర్కొన్నారు. భీమునిపట్నంలో 90.15 హెక్టార్లలో, మచిలీపట్నం వద్ద 1,978.471 హెక్టార్లలో బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌కు అనుమతిచ్చినట్లు తెలిపారు.