కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  రాజీనామా చేశారు. తన నియోజకవర్గమైన మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోటే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఉప ఎన్నిక జరిగితేనే నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందనే ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.
 
ఉప ఎన్నిక వస్తే.. సీటు దక్కించుకోవడానికైనా కేసీఆర్ అభివృద్ధి చేస్తారని పేర్కొంటూ పోడు భూముల సమస్యలపై త్వరలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. . పోడు భూముల సమస్యలు తీరిస్తే రాజీనామా చేసి పోటీ కూడా చేయనని ప్రకటించారు. 
 ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ అరాచకపాలన పోవాలంటే బీజేపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌పై పోరాడలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధతోటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన స్పీకర్ సమయం తీసుకుని రాజీనామా లేఖను అందజేస్తానని వెల్లడించారు.
తెలంగాణలో ప్రతిపక్షం బలంగా లేదని.. అధికార టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పార్టీ సరిగా పోరాటం చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయలేకపోయానని, కాంగ్రెస్‌ను బాధతోనే వీడుతున్నట్లు ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు.
 ‘‘నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోంది. అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్‌ బలహీనపడింది. నా రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరుగుతుంది అని అనుకుంటున్నా. నా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ భవిష్యత్‌ కోసమే. మునుగోడులో ఎవరు గెలుస్తారనేది ప్రజలే నిర్ణయిస్తార’’ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
తనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరింపనున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ అసలు కాంగ్రెస్‌ నా మీద ఎందుకు చర్య తీసుకుంటుంది? నేను ఏ తప్పు చేశా?. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల కింద 20 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న మేం పని చేయాలా?. అని  ప్రశ్నించారు.
“నా జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్లు ఉన్నారు. 20 ఏళ్లపాటు సోనియాను తిట్టిన ఓ వ్యక్తిని పీసీసీ చేశారు. ఆయన కింద మమ్మల్ని పని చేయమంటున్నారు. కమిటీలు వేసేటప్పుడు కూడా కనీసం మాట్లాడలేదు. ఇంతకన్నా అవమానం ఉందా?” అని నిలదీశారు. సోనియా మీద ఉన్న గౌరవంతో తాను ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించదల్చుకోలేదని ఆయన చెప్పారు.
  తెలంగాణ వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉందని, పోడు భూముల సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
ప్రతిపక్ష నేతలను గౌరవించే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కేసీఆర్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని, తెలంగాణ శ్రీలంకగా మారే పరిస్థితి ఉందని హెచ్చరించారు. 
 
 కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, కేసీఆర్ చెప్పుచేతల్లోనే అధికార యంత్రాంగం ఉందని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.