రెండేళ్లలో అప్పు కోసం రూ.65,489.96 కోట్లు హామీ ఇచ్చిన ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత రెండేళ్లలో అప్పు కోసం రూ.65,489.96 కోట్లు హామీ ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21లో రూ. 46,719.42 కోట్లు, 2021-22లో రూ.18,770.54 కోట్లు హామీ ఇచ్చినట్లు 27 ఏప్రిల్‌ 2022న ఏపి ప్రభుత్వం తెలిపిందని కేంద్ర మంత్రి తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టాన్ని రూపొందించాయని మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి అనుగుణంగా సంబంధిత రాష్ట్ర శాసనసభలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 (3) ప్రకారం రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎక్స్‌పెండిచర్‌ డిపార్ట్‌మెంట్‌ సాధారణంగా ఫైనాన్స్‌ కమిషన్‌ ఆమోదించిన సిఫార్సులతో నిర్దేశించబడిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

కంపెనీల పేరుతో రూ. 29,337.24 కోట్ల అప్పు
కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 2020-21లో 22,549.50 కోట్లు, 2021-22లో రూ.6,287.74 కోట్లు, 2022-23లో రూ.500 కోట్లు మొత్తం రూ.29,337.24 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వ రంగ కంపెనీలు, కార్పొరేషన్‌లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పివిలు), ఇతర సమానమైన సాధనాల పేరుతో తీసుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

దీనికి సంబందించిన అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్‌, పన్నులు, సెస్‌, లేదా ఏదైనా ఇతర ఆదాయం కేటాయించడం ద్వారా చెల్లిస్తామని తెలిపినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం సమ్మతిని జారీ చేయడం కోసం రాష్ట్రం స్వయంగా చేసిన రుణాలుగా పరిగణించబడుతుందని తెలిపారు.