జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య

* జయంతి నివాళి 

1947లో స్వాతంత్య్రం రావడానికి ముందే 26 సంవత్సరాల ముందే, ఓ సమైక్య భారత దేశంకు పునాది వేస్తూ ఓ ముసాయిదా జాతీయ  పతాక  రూపకల్పన జరిగింది. దానికి రూపకర్త తెలుగు వారైన పింగళి వెంకయ్య కావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు 1876 ఆగస్టు 2న జన్మించారు. తండ్రి దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణంగా ఉండేవారు. ఆయనకు పెదకళ్ళేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్య ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది.

తరువాత చల్లపల్లిలోను, మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలోనూ విద్య అభ్యసించారు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ చేయటానికి కొలంబో వెళ్లాడు. చొరవ, సాహసం మూర్తీభవించిన వెంకయ్య బొంబాయి వెళ్ళి, 19వ యేట సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని రెండవ బోయర్‌ యుద్ధంలో పాల్గొన్నాడు. అప్పుడు మహాత్మా గాంధీని కలిశారు. అప్పటి నుండి గాంధీజీ మరణించేవరకు ఆయనతో స్నేహం కొనసాగిస్తూ వచ్చారు.

1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. బెంగుళూరు, మద్రాసులలో రైల్వే గార్డుగా పనిచేశాడు. కొంత కాలం బళ్లారిలో ప్లేగు అధికారిగా పని చేశారు. ఆయనలోని దేశభక్తి ఎంతో కాలం ఉద్యోగం చేయనివ్వలేదు. లాహోరు లోని ఆంగ్లో – వేదిక్‌ కళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్‌ భాషలను నేర్చుకున్నారు. ప్రొఫెసర్‌ గోటే ఆధ్వర్యంలో జపనీస్‌, చరిత్ర అభ్యసించాడు.

ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ ఒక పతాకం అవసరమని వెంకయ్యకు 1906లోనే ఆలోచన కలిగింది. గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు ఆయనను కలుసుకున్నారు. మహాత్ముడు సూచించిన ప్రకారం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మధ్యలో రంగుల రాట్నంతో నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు. 1916లో ‘భారత దేశానికి ఒక జాతీయ పతాకం’ అనే ఆంగ్ల గ్రంథాన్ని ఆయన రచించారు.

వెంకయ్య బందరులోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. జమీందారు రాజా బహుదూర్‌ నాయని రంగారావు కోరిక మేరకు పత్తి మొక్కలలోని మేలు రకాలపై పరిశోధనలు చేశారు.

జియాలజీలో పట్టభద్రుడైన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల తవ్వకాల్లో రికార్డు సృష్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాలు మీద అనేక పరిశోధక వ్యాసాలు వ్రాసారు. వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి.

మిలటరీలో పని చేసినందుకు విజయవాడ చిట్టినగర్ లో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో  చిన్న గుడిసె వేసుకొని జీవితాన్ని గడపవలసి వచ్చింది. 1963 జులై 4న వెంకయ్య మరణించారు. ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారత ప్రభుత్వం పింగళి వెంకయ్య జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నది. ఆయన పేరుతో ఓ పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేస్తున్నది. 

బహుముఖ ప్రతిభా విశేషాలు గల ఆయనకు అనేక పేర్లున్నాయి. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడగల ఆయనను `జపాన్ వెంకయ్య’ అని, రత్నాలపై గల అవగాహనకు `డైమండ్ వెంకయ్య’ అని, పత్తి పంటపై ఆయనకు గల లోతయిన పరిజ్ఞానానికి `పత్తి వెంకయ్య’ అని పిలుస్తూ ఉండేవారు. ఇంకా, జాతీయ పతాక రూపశిల్పిగా `జెండా వెంకయ్య’గా ఆయన దేశ వ్యాప్తంగా పేరొందారు