చాలా దేశాలతో పోలిస్తే భేషుగ్గా భారత ఆర్థిక వ్యవస్థ

చాలా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థల్లో మనది కూడా ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో అధిక ధరలపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మన దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు లేదని ఆమె భరోసా ఇచ్చారు.

అంతర్జాతీయ సంస్థల అంచనా మేరకు మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతూ ‘‘భారత్ మాద్యంలోకి, స్టాగ్‌ఫ్లేషన్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు. దేశంలో మాంద్యం వచ్చేందుకు సున్నా అవకాశాలు మాత్రమే ఉన్నాయని బ్లూమ్‌బర్గ్ సర్వే కూడా పేర్కొంది’’ అని నిర్మల గుర్తు చేశారు. ఇది నిజానికి డేటా ఆధారిత చర్చ కంటే రాజకీయ అంశంపై చర్చ అని ఆమె ధ్వజమెత్తారు.

దాదాపు 30 మంది సభ్యులు ధరల పెరుగుదల గురించి మాట్లాడారని, చాలా మంది గణాంకాల ఆధారిత ఆందోళనల కంటే రాజకీయ కోణాలను లేవనెత్తారని నిర్మల విమర్శించారు.  ధరల పెరుగుదలపై విపక్షాలు వారాలపాటు సమావేశాలకు అంతరాయం కలిగించిన తర్వాత సోమవారం పార్లమెంటులో ధరలపై చర్చ జరిగింది.

సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లోనూ మనం నిలబడగలుగుతున్నామని, ఈ విషయంలో ఆ ఘనత అంతా ప్రజలకే చెందుతుందని చెప్పారు. మనం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందగలుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.

‘వాణిజ్య బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. జిఎస్‌టి వసూళ్లు వరసగా 5 నెలల పాటు రూ. 1.4 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఈ ఏడాది జూలై నెలకు 1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది’ అని  ఆర్ధిక మంత్రి వివరించారు.  రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 7శాతం కంటే తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోతోందన్న కాంగ్రెస్ విమర్శలకు మంత్రి బదులిస్తూ.. యూపీఏ  ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం ఏకంగా 9 సార్లు రెండంకెలకు చేరుకున్నట్టు ఆమె గుర్తు చేశారు. యూపీఏ హయాంలో 22 నెలలపాటు ద్రవ్యోల్బణం 9 శాతానికి పైనే ఉన్నట్టు ఆమె చెప్పారు.  మంత్రి సమాధానంతో సం తృప్తి చెందని కాంగ్రెస్‌, డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు.

‘ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 7 శాతం వద్ద ఉంది. యుపిఎ పాలనలో 2004 నుంచి 2014 వరకూ కాలంలో ద్రవ్యోల్బణం రెండెంకెలకు వెళ్లింది. వరసగా 22 నెలల పాటు 9 శాతానికి పైగానే ఉంది’ అని మంత్రి తెలిపారు. ఆ సమయంలో ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం ఎక్కుగా ఉందని ఆమె చెప్పారు.

అమెరికా జీడీపీ మొదటి  క్వార్టర్ లో 1.9% కు పడిపోతే, రెండు క్వార్టర్ లో 0.7% కు పడిపోయిందని ఆమె  పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యధిక ద్రవ్యోల్బణం ఆహారం, ఇంధనంలోనే ఉందని చెబుతూ  అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోందని ఆమె తెలిపారు. మన దేశంలోనూ అది తగ్గుతుందని ఆమె భరోసా వ్యక్తం చేశారు.

m