
తెలుగుదేశంపార్టీ తొలితరం నాయకులు, మాజీమంత్రి జెఆర్ పుష్పరాజ్ (65)కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పరాజు గురువారం సాయంత్రం గుంటూరులోని వైద్యశాలలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడాది క్రితం కరోనా బారిన పడిన తరువాత ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఎన్టీఆర్ , చంద్రబాబు హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. పుష్ప రాజు టిడిపి ఆవిర్బావం నుంచి తుది శ్వాస విడిచేవరకు పార్టీలో కొనసాగారు. విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో సర్దార్ గౌతు లచ్చన్న, డా. యలమంచలి శివాజీ, సుంకర సత్యనారాయణ తదితరులతో కలసి క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండేవారు.
నాగార్జున యూనివర్సిటీ విద్యార్షిసంఘం అధ్యక్షునిగా పనిచేశారు. విజయవాడలోని సిద్దార్థ కళాశాలలో పనిచేస్తున్న ఆయన అధ్యాపక వృత్తిని వదిలి స్వర్గీయ ఎన్టిఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా అనేక పథకాలకు పుష్పరాజ్ నాంది పలికారు.
నిజాయతీపరుడిగా పేరొందిన ఆయన ఎన్టిఆర్, చంద్రబాబు నాయుడుల సమక్షంలోనే పార్టీ, ప్రభుత్వంలోని లోపాలను నిర్మోహాటంగా ఎత్తిచూపుతూ ఉండేవారు. తొలి నుండి అణగారిన వర్గాలు, పేదలపట్ల సానుభూతితో వ్యవహరిస్తూ ఉండడంతో సొంత పార్టీలోని పెత్తందారు, సంపన్న వర్గాల కుట్రలకు తరచూ గురవుతూ ఉండేవారు.
శాసనసభ అంచనాల కమిటీకి రెండు సార్లు చైర్మన్ గా వ్యవహరించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేని `అసమర్ధుడు’ అంటూ పదవులు ఇచ్చినా సంపాదించుకోలేక పోయారని అంటూ పార్టీ పెద్దలే ఆయనను ఎద్దేవా చేస్తూ ఉండేవారు.
పుష్పరాజ్ మృతి పట్ల చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆత్మీయులు జేఆర్ పుష్ఫరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. నాకు అత్యంత ఆప్తులైన నేతలలో ఆయన ఒకరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా దళిత, నిరుపేద ప్రజలకు పుష్పరాజు చేసిన సేవలు చిరస్మరణీయడు” అని చంద్రబాబు కొనియడారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పుష్పరాజు ప్రతి సందర్భంలోనూ పార్టీకి నిజాయితీగా సేవలందించారని చెప్పారు.
More Stories
చంద్రబాబుకు అమరావతి రైతులు 10 రోజుల అల్టిమేటం!
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు