అల్లూరి విగ్రవిష్కరణ కోసం భీమవరంకు నేడే ప్రధాని 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు భీమవరం రానున్నారు. ఆయనతోపాటుగా  రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ హీరో చిరంజీవిలు హాజరు కానున్నారు. 

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ సోమవారం  బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ప్రధాని మోదీ  చేరుకొని,  సభా వేదిక పై నుండే సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.  విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుండి క్షత్రియ వర్గంతో పాటగా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. 

 అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేందుకు ప్రధాని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరవుతున్నారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని, సీఎం ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని ప్రధాని సత్కరిస్తారు.

 అల్లూరి జయంతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 నుండి వారం రోజులపాటు వారోత్సవాలను జరుపుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం భీమవరం వచ్చిన ప్రధాని తిరిగి ఎనిమిది సంవత్సరాల తర్వాత భీమవరం రానుండటంతో ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 

సుమారుగా 50 వేల మంది పైగానే సభకు హాజరయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాలకు, పట్టణాలకు రవాణా సౌకర్యం కల్పించారు. సుమారుగా రెండు వేల మందికి పైగానే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విగ్రహ ప్రాంగణాన్ని, సభా వేదిక ప్రాంగణాన్ని, హెలీప్యాడ్‌ ప్రాంగణాన్ని ఎపిజి తన ఆధీనంలోకి తీసుకుంది. 

బహిరంగ సభ అనంతరం 12.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరతారు. 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 3.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం వెల్లడించింది.