జూన్ లో 35.2 శాతం పెరిగిన ఇంధన వినియోగం

జూన్‌ నెలలో ఇంధన వినియోగం దేశంలో భారిగా పెరిగింది. వేసవిలో ఎక్కువ ప్రయాణాలు ఉండటం, పెరిగిన ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు వంటి కారణాలతో పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, ఎల్పీజీ గ్యాస్‌ వినియోగం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు విడుదల చేసిన సమాచారం వెల్లడించింది.

దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్‌ అమ్మకాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జూన్‌లో 35.2 శాతం పెరిగి, 7.38మిలియన్‌ టన్నులకు చేరింది. ఇది 2020 జూన్‌ నెలతో పోల్చితే 33.3 వాతం అధికం. ఈ సంవత్సరం మే నెలతో పోల్చితే 11.5 శాతం అధికం. మే నెలో 6.7 మిలియన్‌ టన్నుల డీజిల్‌ వినియోగించారు.

ప్రధానంగా వ్యవసాయ రంగం, రవాణా రంగంలో డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల పెట్రోల్‌ బంక్‌ల ద్వారా ఈ సంవత్సరం జూన్‌లో 2.8 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి.

ఇది గత సంవత్సరం జూన్‌తో పోల్చితే 29 శాతం అధికం. 2020సంవత్సరంతో పోల్చితే 16.5 శాతం ఎక్కువ. వేసవి ప్రయాణాలు ప్రధానంగా పెట్రోల్‌ అమ్మకాలు పెరగడానికి కారణమని పేర్కొంది. జూన్‌ నెలలో వంటగ్యాస్‌ ధర సిలిండర్‌కు 103.50 రూపాయలు పెంచారు. ఈ నెలలో అమ్మకాలు 2.36 మిలియన్‌ టన్నులుగా ఉంది.

ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే కేవలం 0.23 శాతం మాత్రమే పెరిగింది. లాక్‌ డౌన్‌ కాలంలో పేదలకు ఉచితంగా గ్యాస్‌ పంపిణీ చేయడం వల్ల 2020 జూన్‌తో పోలచితే 9.6 శాతం పెరుగుదల నమోదైంది. రెండు సంవత్సరాల తరువాత విమానయాన రంగం తిరిగి ప్రారంభం కావడంతో జూన్‌లో 535900 టన్నుల ఇంధన అమ్మకాలు జరిగాయి.