ఆఫ్ఘన్ లో దుర్భరంగా మహిళల జీవితం

తాలిబన్ల చేతుల్లోకి అధికారం వచ్చిన నాటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జీవితం దుర్భరంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.  ప్రజా జీవితం నుండి మహిళల్ని దూరంగా ఉంచే ప్రయత్నాలు పెరుగుతున్నాయని గమనించినట్లు ఐరాస మానవ హక్కుల మండలికి భారత్‌ తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజా పాలనను హస్తగతం చేసుకున్న తాలిబన్ల ఇలాకాలో బాలికలు, మహిళల స్థితిగతులపై ఐరాసలో అత్యవసర చర్చ జరిగింది. ఫ్రాన్స్‌, యూరోపియన్‌ యూనియన్‌ అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగింది. తాలిబన్‌ దేశంలో మహిళలు, బాలికలకు విద్యాహక్కును కలిగి ఉండటంతో పాటు ప్రజాజీవితంలో భాగస్వామ్యం అయ్యేలా తాలిబన్‌ చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది.
ఈ చర్చల్లో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి పునీత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలను ప్రజా జీవితం నుండి దూరం చేసే ప్రయత్నాలు పెరిగాయని భారత్‌ పరిశీలించినట్లు చెప్పారు. ‘అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా పౌరులు, చిన్నారులు, బాలికలు, మహిళల ప్రాథమిక హక్కులతో పాటు వాక్‌ స్వాతంత్య్రం, విద్య, వైద్య సంరక్షణ వంటి వాటికి విఘాతం కలుగుతుంది’ అని పేర్కొన్నారు.
ఆ దేశంలో మహిళలు, బాలికలకు విద్యా హక్కుతో సహా వారి హక్కుల సంరక్షణకు భరోసానివ్వాలని, రెండు దశాబ్దాలుగా పోరాడి సాధించిన వాటిని కోల్పోకుండా చూడాలని చెబుతున్న ఇతర దేశాలకు భారత్‌ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. ఆఫ్ఘన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని తెరవడానికి దౌత్యవేత్తల బృందం ఆ దేశాన్ని సందర్శించిన అనంతరం ఈ ప్రకటన వచ్చింది.